BJP Leaders Celebrations in AP:దిల్లీ అసెంబ్లీ ఎన్నకల్లో బీజేపీ విజయంపై రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. దిల్లీ పీఠాన్ని కమలనాథులు కైవసం చేసుకోవడంతో పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి, మిఠాయిలు తినిపించుకుని, నృత్యాలు చేశారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజీ, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం, ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు.
ఏలూరులో సంబరాలు:డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారానే దిల్లీ అభివృద్ధి సాధ్యమన్న విశ్వాసంతోనే భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి అన్నారు. దిల్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ విజయభేరి మోగించిన నేపథ్యంలో, ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయంలో వద్ద నిర్వహించిన సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలతో కలిసి బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచిపెట్టారు.
బీజేపీ విజయం ప్రజలకే చెందుతుంది: దిల్లీలో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం ప్రజలకే చెందుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ప్రజలంతా నిబద్ధతతో శ్రమించి బీజేపీని గెలిపించారని పేర్కొన్నారు. సుపరిపాలన, మౌలిక వసతులు, కాలుష్య రహిత యమునను ప్రజలంతా ఆశించారని పేదలకు ఇళ్లు, శుభ్రమైన తాగునీటి వసతులను కోరుకున్నారని అన్నారు. కులమతాలు, వర్గాలకు అతీతంగా ప్రజలంతా ఎదిగారని బీజేపీపై తిరుగులేని విశ్వాసం ఉంచారని తెలిపారు.