Bio Asia Conference in Hyderabad :మారుమూల ప్రాంతాలకైనా సులువుగా తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేసే మొబిల్యాబ్ డీఎన్‌ఏ పరీక్ష చేసేందుకు మినీ యంత్రం.. కళ్లు పొడిబారకుండా కృత్రిమ మేధ ద్వారా హెచ్చరించే యాప్.. ఇలాంటి ఎన్నో ఆవిష్కరణలు హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరిగిన ‘బయో ఆషియా సదస్సు'లో ఆకట్టుకున్నాయి.
రక్తపరీక్షలు చేసే కిట్ : వ్యాధిని గుర్తించడానికి ప్రాథమికంగా చేసే పరీక్షల్లో ముఖ్యమైంది రక్తపరీక్ష. ఇంటికే వచ్చి నమూనాలు సేకరిస్తున్నా వాటిని ల్యాబ్‌కు తీసుకెళ్లాల్సిందే. గ్రామీణ ప్రాంతాల్లోని వారు పరీక్షల కోసం సమీపంలోని పట్టణాలకు రావాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కష్టాలను తప్పించేందుకు నోయిడాకు చెందిన ప్రైమరీ హెల్త్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మొబిల్యాబ్ పేరుతో రక్తపరీక్షలు చేసే సూట్‌కేస్ కిట్‌ను అభివృద్ధి చేసింది. సూట్‌కేస్‌ను ఎక్కడికైనా తీసుకెళ్లి అరగంట వ్యవధిలో రక్తపరీక్షలు చేయవచ్చు. బ్యాటరీ ఛార్జింగ్‌తోనూ ఇది పనిచేస్తుందన్నారు. ఒకసారి ఛార్జ్ చేస్తే 600 పరీక్షలు చేయవచ్చని తయారీదారులు తెలిపారు.
పొడిబారే కళ్లకు హెచ్చరిక :చాలామంది డిజిటల్ యుగంలో ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేదాకా మొబైల్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌ల మీదనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. తరచూ స్క్రీన్లను చూడటం ద్వారా కళ్లు పొడిబారుతున్నాయి. కళ్లు పొడిబారినట్లు గుర్తించే పరికరానికి ప్రత్యామ్నాయంగా ఓ యాప్‌ను ఐడీ పేరుతో అభివృద్ధి చేశారు. స్మార్ట్ బ్లింక్ రిమైండర్‌గా పనిచేసే ఈ యాప్ కంటిపై పడే ఒత్తిడిని తగ్గించేందుకు ఉపయోగపడుతుందని ఆవిష్కర్తలు తెలిపారు.