Bike Thift Gang Arrest In Hyderabad : సెకండ్‌హ్యాండ్ వాహనాలు కొనే సమయంలో పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించుకొని అవసరమైతే రవాణాశాఖ కార్యాలయంలో వాకబు చేసిన తరువాతే నిర్ణయం తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. నగరంలో ఈ ఏడాది 8 నెలల్లో వాహన దొంగతనాలకు పాల్పడుతున్న 30 మందికి పైగా అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. 200 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 100 వాహనాలను నకిలీపత్రాలతో విక్రయించినట్టు గుర్తించారు.
రోజుకు ఐదు బండ్లు మాయం : నగరంలో 90లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలుంటాయని అంచనా. బైక్‌ట్యాక్సీ, ఇ-కామర్స్ వ్యాపారంతో యువతకు ఉపాధి లభిస్తోంది. కొత్త వాహనం కొనేందుకు రూ.లక్షకు పైగా వెచ్చించాలి. సెకండ్‌హ్యాండ్ మార్కెట్‌లో కోరుకున్న బండి రూ.20వేల నుంచి లభ్యమవుతోంది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ రాష్ట్రాలకు చెందిన అంతరాష్ట్ర ముఠాలతో చేతులు కలిపిన స్థానిక దొంగలు బండ్లు కొట్టేస్తున్నారు. పాతబస్తీ శివారు ప్రాంతాల్లో మైనర్లకు కమీషన్ ఆశచూపి వారితో దొంగతనాలు చేయిస్తున్నారు. కేవలం సెకన్ల వ్యవధిలో తాళం తీయటం వారి ప్రత్యేకత. నగరంలో సగటున ప్రతిరోజూ 10 నుంచి 15 వాహనాలు మాయమవుతుండగా వాటిలో 5 నుంచి ఆరు మాత్రమే కేసులు నమోదవుతున్నాయి.
బండికి రూ.10వేలు రాబడి :బండి మాయంచేసేందుకు ముఠాలు రెక్కీ నిర్వహిస్తాయి. పాన్ దుకాణాలు, రహదారుల పక్కన, ఇంటి ముందుంచిన వాహనాలను తాళాన్ని తీసి కొద్దిదూరం నెట్టుకుంటూ వెళ్తారు. అనంతరం ఆటోల్లోకి చేర్చి తరలిస్తారు. ఒక్కోబైక్‌ను రూ.20-30వేలకు విక్రయిస్తారు. రవాణా, ఏజెంట్లకు కమీషన్‌ఇవ్వగా దొంగకు రూ.10వేలు మిగులుతాయని పోలీసుఅధికారి తెలిపారు. దొంగబండ్లను ఎక్కువగా చైన్‌స్నాచర్లు, అంతరాష్ట్ర దొంగలు, గంజాయి, రేషన్‌బియ్యం అక్రమతరలింపుల్లో ఉపయోగిస్తున్నారు.