Bhubharathi Portal in Telangana : ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి పోర్టల్‌ను తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ముందుకు వెళ్తోంది. రాష్ట్రంలో ధరణి పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత లక్షలాది మంది పట్టాదారు పాస్ పుస్తకాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ పలుమార్లు సమావేశమై చర్చించిన తర్వాత భూ సమస్యలను పరిష్కరించేందుకు గత మార్చి మొదటి వారంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో రాష్ట్రంలో భూసమస్యలు ఉత్పన్నమయ్యాయి. కొత్త తరహా పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చినప్పుడు ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ అలాంటిదేమీ చేయకపోవడంతో లక్షలాది మంది భూ సమస్యలతో సతమతమవుతూ వచ్చారు.
Telangana Government on Dharani Portal Issues: గత ప్రభుత్వంలోనే భూ సమస్యల పరిష్కారానికి దాదాపు 2.46 లక్షల దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చి మొదటి వారంలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో మరో 60 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో భూ సమస్యల పరిష్కారానికి వచ్చిన దరఖాస్తులు మూడు లక్షలు దాటాయి. ధరణి కమిటీ సూచన మేరకు ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఇందులో లక్షకుపైగా సమస్యలు మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పరిశీలన పూర్తి చేసుకుని సీసీఎల్‌ఏకు చేరినట్లు ధరణి కమిటీ సభ్యులు చెబుతున్నారు. వీటికి సంబంధించి ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్ చేసే కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. ఇది పూర్తయితే కానీ ఆ లక్ష మంది రైతులకు చెందిన భూములు ఆన్‌లైన్‌లో కనిపించవు. వారం, పది రోజుల్లో ఈ లక్ష సమస్యలు పరిష్కారం అవుతాయని చెబుతున్నారు.
ధరణి పోర్టల్ ప్రక్షాళన దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు - TG Govt Focus on Dharani Problems
Bhubharathi Works to Near Complete: న్యాయస్థానాల్లో పెండింగ్ ఉన్నవి, కుటుంబ తగాదాలతో పెండింగ్ ఉన్నవి పక్కన పెడితే టీఎం-33 మోడ్యూల్ కింద పరిష్కరించాల్సినవి సమస్యలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వీటిలో ఎక్కువ కలెక్టర్ల స్థాయిలో పరిష్కారమయ్యేవని ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి చెబుతున్నారు. పార్ట్-బి, సాదాబైనామాలకు చెందిన సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించి భూహక్కులు కల్పించాలంటే కొత్తగా ఆర్ఓఆర్ చట్టం తీసుకురావాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు 2020లో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్వోఆర్ చట్టం అమలు చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలు ఏమీ లేకపోవడంతో చట్టం తెచ్చి కూడా ప్రయోజనం లేకుండా పోయినట్లు అధికారులు చెబుతున్నారు.