Vijayawada Floods Affected Bhavani Island : బెజవాడలో కొండపైన దుర్గమ్మ, గలగల పారే కృష్ణమ్మ ఎంత ఫేమస్సో నది గర్భంలోని భవానీ ద్వీపానికి అంతే ప్రత్యేకత ఉంది. ఈ అత్యద్భుతమైన ప్రదేశం దుర్గమ్మ పాదాల చెంత ఉంటడంతో అమ్మవారి దర్శనానికి వచ్చిన వారంతా ఇక్కడికి కుటుంబంతో కలిసి వెళ్తారు. కృష్ణా నదిలో బోటులో విహారం చేస్తూ భవానీ ద్వీపానికి చేరుకుని అక్కడి అందాలను ఫోటోలు, వీడియోల్లో బంధించి మధురానుభూతులను మిగుల్చుకుని తిరిగి వెళ్తారు.
ఇలా పర్యాటక శాఖకి కాసుల వర్షం కురిసేది. అలాంటి సర్వాంగ సుందరమైన ప్రదేశం వరద విలయంలో చిక్కుకుని విధ్వంసానికి గురైంది. ప్రకృతి అందాలతో పాటు, మనిషి సృష్టించిన అబ్బురపరిచే కళారూపాలు జల ప్రళయంతో కళా విహీనంగా మారాయి. 20 రోజుల పాటు నదీ గర్భంలో భవానీ ద్వీపం ఇన్నాళ్లకు బయట పడింది. వరద ఉద్ధృతికి స్పీడ్ బోట్లు సైలెంట్ అయిపోయాయి. భారీ బోట్లు ఎక్కడికక్కడే ఆగిపోయి బోసిపోయాయి.
కళావిహీనంగా మారిన కళారూపాలు :భారీ వృక్షాలు నేలకొరగగా ఇసుక తిన్నెలు మూడు అడుగుల మేర పచ్చదనాన్ని కప్పేశాయి. 20 అడుగుల మేర వచ్చిన నీటి ప్రవాహంతో భారీ భవంతుల్లోని హోటళ్లు అన్నీ నీట మునిగి ధ్వంసమయ్యాయి. 600 ఎకరాల్లోని భవానీ ద్వీపం వరద ప్రవాహంలో చిక్కుకుపోయింది. 139 ఎకరాల్లో ఏర్పాటు చేసిన వినోద, విహార ప్రాంతాలు అందవిహీనంగా మారాయి. భవానీ ద్వీపం ఐకాన్ వద్ద తీరం వెంట నిర్మించిన 12 అడుగుల రోడ్డు సైతం నదిలో కోతకు గురైంది. లక్షలు విలువ చేసే సామగ్రి, యంత్ర పరికరాలు, ఆట వస్తువులు ఎందుకూ పనికి రాకుండా పోయాయి.