తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎవరీ బతుకమ్మ? ఎందుకు పండగలా జరుపుకుంటారు? అసలు విషయమేంటి? - Bathukamma Festival 2024 - BATHUKAMMA FESTIVAL 2024

Bathukamma Festival 2024 : ఆశ్వయుజ మాసంలో జరుపుకునే అతిపెద్ద పండుగ దసరా. అయితే ఈ పండుగను దేశవ్యాప్తంగా వారి వారి సంస్కృతి ప్రకారం జరుపుకుంటారు. అలాగే తెలంగాణలో కూడా దసరా పండుగ బతుకమ్మ పండుగగా విశేషంగా జరుపుకుంటారు. దసరాను తెలంగాణాలో బతుకమ్మ పండుగ అని ఎందుకంటారు? అసలు ఎవరీ బతుకమ్మ? వివరాల కోసం ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

Bathukamma Festival story
Bathukamma Festival 2024 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 3, 2024, 7:40 PM IST

Bathukamma Festival 2024 : బతుకమ్మ పండుగ తెలంగాణలో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన ఈ బతుకమ్మ పండుగ ఆ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక. ఏ పండుగ అయినా జరుపుకునే ముందు దాని పూర్వాపరాలు తెలుసుకోవాలి. ఒక పండుగను ఎందుకు జరుపుకుంటాం? దాని వెనుక ఉన్న కారణాలేమిటి అని తెలుసుకొని పండుగను జరుపుకుంటే విజ్ఞానంతో పండుగ వేడుకలను కూడా పూర్తిగా ఆనందించవచ్చు.

బతుకమ్మ పండుగ ఎలా చేస్తారు?తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగ రోజుల్లో మహిళలు, అమ్మాయిలు రంగు రంగుల పూలతో బతుకమ్మను త్రికోణాకారంలో పేర్చి, అలంకరించిన ఆ బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు. బతుకమ్మ సంబరాలు తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి.

బతుకమ్మ పండుగ వేడుకలు ఎప్పటి నుంచి మొదలు?భాద్రపద బహుళ అమావాస్య అంటే మహాలయ అమావాస్య నుంచి బతుకమ్మ వేడుకలు మొదలై ఆశ్వయుజ శుద్ధ అష్టమి అనగా దుర్గాష్టమి పర్వదినంతో ముగుస్తాయి.ఈ ఏడాది అక్టోబర్ 2 నుంచి మొదలై అక్టోబర్ 10 దుర్గాష్టమితో ముగియనున్నాయి. అయితే ఈ ఏడాది అక్టోబరు 11 ఉదయం 11 గంటల వరకు అష్టమి తిధి ఉంది. అందుకే ఆ రోజు కూడా ముగింపు వేడుకలు జరుపుకోవచ్చు. ఇది వారి సంప్రదాయాన్ని అనుసరించి ఉంటుంది.

మొదటి రోజు-ఎంగిలి పూల బతుకమ్మ : మహాలయ అమావాస్య రోజు నుంచి ప్రారంభమయ్యే బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని 'పెత్రామస' అని కూడా అంటారు. ఈ రోజు నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేసి బతుకమ్మకు నివేదిస్తారు.

రెండో రోజు- అటుకుల బతుకమ్మ : ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అటుకుల బతుకమ్మ వేడుక జరుగుతుంది. ఈ రోజు సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.

మూడో రోజు-ముద్దపప్పు బతుకమ్మ : మూడో రోజు ముద్ద పప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి బతుకమ్మకు సమర్పిస్తారు.

నాలుగో రోజు- నానే బియ్యం బతుకమ్మ : ఈ రోజు నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేసి బతుకమ్మకు నివేదిస్తారు.

ఐదో రోజు- అట్ల బతుకమ్మ : ఈ రోజు బతుకమ్మకు అట్లు లేదా దోశలు నైవేద్యంగా సమర్పిస్తారు.

ఆరో రోజు అలిగిన బతుకమ్మ : ఆరవ రోజైన ఆశ్వయుజ పంచమి నాడు బతుకమ్మను అలిగిన బతుకమ్మగా పూజిస్తారు. ఈ రోజున అమ్మవారు అలిగి ఉంటారని ఏమి తినరని అంటారు. అందుకే నైవేద్యమేమి సమర్పించరు.

ఏడో రోజు- వేపకాయల బతుకమ్మ : ఈ రోజు వేపకాయల బతుకమ్మకు బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లు ఆకారంలో తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ :ఈ రోజు నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేసి బతుకమ్మకు నివేదిస్తారు.

తొమ్మిదో రోజు- సద్దుల బతుకమ్మ : ఆశ్వయుజ అష్టమి నాడు దుర్గాష్టమి మహా పర్వదినం రోజున బతుకమ్మకు ఐదు రకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం. ఇలా ఐదు రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తారు.

తెలంగాణాలో బతుకమ్మ సంబరాలుబతుకమ్మ సంబరాలలో తెలంగాణాలో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుని ఈ పూల పండుగ సంబరాలు జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజులలో వీరు రోజూ బతుకమ్మలు చేసి, ప్రతీ సాయంత్రం వాటి చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తర్వాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు. చివరి రోజు సద్దుల బతుకమ్మ పండుగ రోజు మగవారంతా పచ్చిక బయళ్లలోనికి పోయి తంగేడు, గునుగు మొదలగు పూలను భారీగా ఏరుకుని వస్తారు. ఆ తరువాత ఇంటిల్లపాదీ కూర్చుని ఆ పూలతో బతుకమ్మను తయారు చేస్తారు.

చీకటి పడే సమయంలో స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకుని ఊరిలో ఉన్న పెద్ద చెరువు వైభవంగా ఊరేగింపుగా బయలుదేరుతారు. 'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో' అంటూ పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు. ఉద్యమ స్ఫూర్తిని పెంచిన బతుకమ్మ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైంది. ఉద్యమ సందర్భంలో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు. ఉద్యమ నాయకుల్లో స్ఫూర్తిని పెంచారు.

తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తరువాత బతుకమ్మ పండుగకు ప్రాధాన్యం మరింతగా పెరిగిపోయింది. ప్రస్తుతం విదేశాలలో కూడా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణా ప్రజల పండుగ బతుకమ్మ పండుగ సంబరాలను అందరూ ఆనందంగా జరుపుకుందాం మన సంస్కృతీ సంప్రదాయాలను మన భావితరాలకు భద్రంగా అందిద్దాం. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఓం శ్రీ గౌరీ దేవ్యై నమః

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

రికార్డు​ సృష్టించిన బతుకమ్మ - 36.2 అడుగుల తయారీకి ఇంటర్నేషనల్‌ వరల్డ్ బుక్‌ ఆఫ్‌ రికార్డు - Worlds Largest Bathukamma Jangaon

2024లో ఉర్రూతలూగిస్తున్న బతుకమ్మ పాటలు ఇవే - మీరు ఒక్కసారైనా విన్నారా? - 2024 Bathukamma Songs With Lyrics

ABOUT THE AUTHOR

...view details