Barytes Mines Lease Scam YSR District : వైఎస్సార్సీపీ హయాంలో ప్రధాన పోస్టులో ఉన్న ఓ మాజీ అధికారి కుమారుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కడప జిల్లాలో ముగ్గురాయి బైరెటీస్ లీజును దొంగదారిలో దక్కించుకున్నాడు. తెరముందు ప్రభుత్వ రంగ సంస్థను పెట్టి జాయింట్ వెంచర్ కింద బెరైటీస్ గనుల్ని కొట్టేశాడు. అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి డైరెక్షన్‌లో ఈ గూడుపుఠాణీ సాగింది.
వైఎస్సార్సీపీ పాలనలో ప్రధాన అధికారి కుమారుడికి కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం పలుగురాళ్లపల్లె పరిధిలోని బైరెటీస్ గనుల్ని వేలం లేకుండా కట్టబెట్టిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గనుల లీజు కోసం వ్యక్తులు, సంస్థలుగానీ నేరుగా దరఖాస్తు చేసుకుంటే ఈ-వేలంలో లేదా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానంలో కేటాయింపులు జరుపుతారు. ఎక్కువ మంది పోటీ దారులుంటే ఈ-వేలం వేస్తారు. నేరుగా అర్జీ చేస్తే గనుల లీజు దక్కించుకునే వీలుండదని భావించిన మాజీ ప్రధాన అధికారి పుత్రుడు, అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డితో కలిసి కుట్రపన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయినా ఏపీఎండీసీ తెరముందుకు తెచ్చారు.
తెరపైకి సారు కుమారుడి సంస్థ : ఏపీఎండీసీకి పలుగురాళ్లపల్లె సర్వే నంబరు 222/9పీలో ఉన్న 24.5 హెక్టార్లు లీజుకు కేటాయించాలని 2023 ఆరంభంలో ఏపీఎండీసీతో గనులశాఖకు అర్జీ పెట్టించారు. ఆ సంస్థ ఎండీ, గనులశాఖ డైరెక్టర్ రెండూ వెంకటరెడ్డే కావడంతో కుట్ర చకచకా అమలైంది. ఆ భూమిని గనుల శాఖ ఏపీఎండీసీకి రిజర్వ్ చేసింది. అనంతరం అందులో భూగర్భ మైనింగ్ చేసేలా లీజు కేటాయించింది.
ఏపీఎండీసీ జాయింట్ వెంచర్‌గా ముగ్గురాయి వెలికితీసి విక్రయించేందుకు 2023 జులైలో గనులశాఖ టెండర్లు ఆహ్వానించింది. మూడు బిడ్లు దాఖలైనట్లు చూపించి చివరకు సదరు మాజీ ప్రధాన అధికారి పుత్రరత్నానికి చెందిన సంస్థ ఎస్ఆర్ బెరైటీస్ మైన్స్ అండ్ మినరల్స్ అనే సంస్థకు బిడ్ కట్టబెట్టారు. అది ఆ లీజులో తవ్వితీసే ప్రతి టన్ను ముగ్గురాయికి ప్రభుత్వానికి సీనరేజ్ చెల్లించడంతోపాటు సీనరేజ్ విలువకు 1.65 రెట్లు ఏపీఎండీసీకి చెల్లిస్తానని కోట్ చేసింది. 2023 సెప్టెంబర్‌లో టెండర్ ఖరారు చేశారు.
ఎస్ఆర్ బెరైటీస్ అనే సంస్థ పుత్రరత్నానిదైనప్పటికీ దాని తెరవెనుక ఉంది మాజీ ప్రధాన అధికారేనని నాడు గనులశాఖలో అందరికీ తెలిసినా ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. అప్పటి మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి చెప్పినట్లు తలాడించి అక్రమాలకు సహకరించారు. 2023లోనే టెండర్ ఖరారు చేసినా ఎస్ఆర్ బెరైటీస్ మైన్స్ అండ్ మినరల్స్ సంస్థ ఇప్పటివరకూ ఏపీఎండీసీతో ఒప్పందం చేసుకోలేదు. పర్యావరణ అనుమతులు రావడంలో జాప్యమైంది.