Balkampet Yellamma Kalyanam :ఏడు వందల ఏళ్ల క్రితం స్వయంభువుగా వెలిసి భక్తుల పూజలందుకుంటున్న బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణం కన్నుల పండువగా సాగింది. ఆషాఢమాసంలో తొలి మంగళవారం కావటంతోనే జమదగ్ని సహిత రేణుకాదేవి కల్యాణ వేడుకలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. ఈ సందర్భంగా స్వల్ప తోపులాట జరిగింది. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి కొద్దిసేపు ఆలయం బయటే ఉండిపోయారు. ఈ క్రమంలో కలెక్టర్‌పై మంత్రి పొన్నం అసహనం వ్యక్తం చేశారు. వేడుకల సందర్భంగా భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తోపులాటలో కుట్ర కోణం దాగి ఉంది :ఈ సంఘటన అనంతరం దేవదాయ శాఖ అధికారులతో మంత్రి కొండా సురేఖ అత్యవసర సమావేశం నిర్వహించారు. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో తోపులాటపై మంత్రి సమీక్ష చేశారు. కల్యాణోత్సవంలో తోపులాటపై పోలీసుల దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. ఎల్లమ్మ కల్యాణోత్సవంలో తోపులాట వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. ఇక ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులకు మంత్రి సురేఖ తెలిపారు.
అయితే ప్రతి సంవత్సరంలాగేనే ఈ ఏడాది కూడా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం వైభవంగా సాగింది. అమ్మవారికి 27 చీరలు, స్వామివారికి 11 పంచెలతో అలంకారం చేశారు. స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ప్రభుత్వం తరఫున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ వేడుకల్లో పాల్గొన్నారు. కొండా సురేఖ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను అమ్మవారికి సమర్పించారు. భక్తులు భారీగా తరలివస్తున్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
అమ్మవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి :బల్కంపేట ఎల్లమ్మను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారి కల్యాణ ఉత్సవం వైభవంగా సాగుతోందన్న కిషన్‌రెడ్డి ఏర్పాట్లు చాలా బాగున్నాయన్నారు. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు, అనారోగ్యాలు లేకుండా చూడాలని, పంటలు బాగా పండి ప్రజలు సంతోషంగా ఉండాలని మొక్కుకున్నానని తెలిపారు. కేంద్రం తరపున ఆలయ అభివృద్ధికి నాలుగున్నర కోట్లు నిధులు మంజూరు చేశామన్న కిషన్‌రెడ్డి త్వరలో ఆ నిధులకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతానని చెప్పారు.