IIT Madras And ISRO: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (IIT Madras) ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)తో జతకట్టింది. ఫ్లూయిడ్ అండ్ థర్మల్ సైన్సెస్‌లో పరిశోధనల కోసం 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'ను స్థాపించేందుకు ఐఐటీ మద్రాస్.. ఇస్రోతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ సెంటర్ ఏర్పాటు కోసం ఇస్రో 1.84 కోట్ల సీడ్ ఫండింగ్‌ను రిలీజ్ చేసినట్లు తెలిపింది.
ఐఐటీ మద్రాస్ తెలిపిన సమాచారం ప్రకారం.. 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' ఇస్రోకు మేజర్ పరిశోధనా కేంద్రంగా పనిచేస్తుంది. అంతరిక్ష నౌక, ఎగిరే వాహనాల ఉష్ణోగ్రత నిర్వహణను అధ్యయనం చేసేందుకు ఉపయోగపడుతుంది. ఐఐటీ మద్రాస్ ఫ్యాకల్టీ వారి నైపుణ్యంతో థర్మల్ యూనిట్స్ రూపకల్పన, విశ్లేషణ, టెస్టింగ్‌లో సహకారం అందిస్తారు. ఈ మేరకు 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' స్థాపనపై అవగాహన ఒప్పందంపై రెండు సంస్థల ప్రతినిధులు సోమవారం సంతకాలు చేశారు. ఐఐటీ మద్రాస్ మెకానికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్, సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.
దీని లక్ష్యం ఏంటంటే?: స్పేస్‌క్రాఫ్ట్, లాంచ్ వెహికల్స్‌కు సంబంధించిన థర్మల్ సవాళ్లను పరిష్కరించడమే ఈ సెంటర్ లక్ష్యం. ఈ నేపథ్యంలో మౌలిక సదుపాయాలు, పరికరాలు, భవిష్యత్తు పరిశోధన అవసరాల కోసం ఇస్రో తొలుత రూ.1.84 కోట్లను రిలీజ్ చేసింది. ఈ సెంటర్ స్పేస్‌క్రాఫ్ట్ థర్మల్ మేనేజ్‌మెంట్, హైబ్రిడ్ రాకెట్స్‌లో దహన అస్థిరత, క్రయోజెనిక్ ట్యాంక్ థర్మోడైనమిక్స్ వంటి వాటి ఉష్ణోగ్రత నిర్వహణపై దృష్టి సారిస్తుంది.
ఇండస్ట్రీ- అకాడెమియా సహకారం: ఈ సెంటర్ ఇస్రో సైంటిస్టులు, ఐఐటీ మద్రాస్ అధ్యాపకుల మధ్య గొప్ప సహకారాన్ని మెరుగుపరుస్తుంది. ఫ్ల్యూయిడ్ అండ్ థర్మల్ సైన్స్‌లో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. ఇస్రో శాస్త్రవేత్తలు, ఐఐటీ మద్రాస్ అధ్యాపకులతో పాటు విద్యార్థులు థర్మల్ సైన్స్‌లోని క్లిష్టమైన రంగాల్లో పరిశోధనలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇది వీలు కల్పిస్తుంది.
దీనిపై ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ అరవింద్ పట్టమట్ట మాట్లాడారు. ఇస్రో, ఐఐటీ మద్రాస్ మధ్య విశిష్ట సహకారాన్ని ఈ సెంటర్ సులభతరం చేస్తుందన్నారు. ఇది ఇండియా స్పేస్ ప్రోగ్రామ్‌కు సపోర్ట్ చేసేందుకు, స్పేస్ టెక్నాలజీలో సెల్ఫ్-రిలయన్స్ పెంచేందుకు థర్మల్ సైన్స్‌లో జాయింట్ రీసెర్చ్‌కు ఉపయోగపడుతుందని తెలిపారు.
ఐఐటీ మద్రాస్, ఇస్రో సెల్ఫ్ సస్టెయినింగ్ స్పేస్ ప్రోగ్రాం కోసం పరిశోధనలను ప్రోత్సహించేందుకు 1985లో 'ISRO-IIT M స్పేస్ టెక్నాలజీ' సెల్‌ను స్థాపించాయి. ఇప్పుడు థర్మల్ మేనేజ్‌మెంట్ పరిశోధన, ఇస్రో లక్ష్యాలకు మద్దతుగా ఇతర కీలకమైన రంగాలపై దృష్టి సారించేందుకు 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'ను నిర్మిస్తున్నట్లు అరవింద్ పట్టమట్ట తెలిపారు.
'రోజుకి 1.35 కోట్ల ఫ్రాడ్ కాల్స్- బ్లాక్ చేయడంతో రూ. 2,500 కోట్ల ఆస్తి సేఫ్'
సెల్ఫ్ రిపేర్ ప్రోగ్రాంను విస్తరించిన యాపిల్- ఐఫోన్ 16 సిరీస్ యాక్ససరీస్ ధరల వివరాలివే!