రాష్ట్ర వ్యాప్తంగా ఈద్గాల వద్ద సందడి (ETV Bharat) Bakrid Prayers in telangana Today :2024 బక్రీద్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులకు పలువురు ప్రముఖలు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు బక్రీద్ విషెస్ చెప్పారు. దైవభక్తి, త్యాగ నిరతికి బక్రీద్ పండుగ అద్దం పడుతుందని వ్యాఖ్యానించారు. సమాజం కోసం త్యాగం చేయాలనే సందేశం బక్రీద్ పండగ ఇస్తుంది మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఈసందర్భంగా ముస్లింలకు కేసీఆర్ బక్రీద్ శుభeకాంక్షలు తెలియజేశారు.
మంత్రుల శుభాకాంక్షలు : మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఈద్గాలు, దర్గాలు ముస్లిం సోదరులతో సందడిగా మారాయి. పలు ప్రాంతాల్లో స్థానిక నేతలు ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మునుగోడు రోడ్డులోని ఈద్గా వద్ద రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బక్రీద్ ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. మరోవైపు అల్లా దయ రాష్ట్ర ప్రజలపై ఉండాలంటూ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆకాంక్షించారు.
హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం బోలక్పూర్, ముషీరాబాద్, రామ్ నగర్, గాంధీ నగర్, అడిక్ మెట్, కవాడిగూడ డివిజన్లోని మసీదులలో బక్రీద్ పండుగ పురస్కరించుకొని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థన అనంతరం వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరూ పరస్పరం ఆలింగనం చేసుకొని బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో జరిగిన బక్రీద్ ప్రార్థనల్లో ఎంపీ సురేశ్ షెట్కార్ పాల్గొన్నారు. మాజీ మంత్రి చంద్రశేఖర్‌తో కలిసి ఈద్గా మైదానానికి వెళ్లిన ఎంపీ షెట్కార్ ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం ప్రజా ప్రతినిధులు, నాయకులను ఆలింగనం చేసుకుంటూ విషెస్ చెప్పారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండగ అందరి ఇళ్లలో సంతోషాలు నింపాలని ఎంపీ ఆకాంక్షించారు. కరీంనగర్‌లోని సాలెహన్ నగర్ ఈద్గా వద్ద బక్రీద్ సందర్భంగా ప్రార్థనలు చేశారు. మత పెద్ద బక్రీద్ విశిష్టతను వివరించారు. జగిత్యాల జిల్లాలో ముస్లిం సోదరులు బక్రీద్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు.
మైనార్టీల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం :బక్రీద్ పండుగ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు బక్రీదు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ ప్రత్యేక ప్రార్థనల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కామారెడ్డి నియోజకవర్గ ముస్లిం సోదరులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసినట్లు షబ్బీర్ అలీ తెలిపారు. మైనార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని చెప్పారు. గత ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు కళాశాలలో ఎక్కువగా సీట్లను కేటాయించిందని వెల్లడించారు.