ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గంటల వ్యవధిలోనే పట్టుబడ్డ నిందితుడు - బెడిసికొట్టిన వ్యూహాలు - BADVEL INTER STUDENT INCIDENT

ఐదేళ్లుగా ఇంటర్ విద్యార్థిని, విఘ్నేష్ మధ్య ప్రేమ వ్యవహారం - పెళ్లి చేసుకోమని అడగటంతో బాలికపై పెట్రోల్ పోసి నిప్పు

BADVEL_INTER_STUDENT_INCIDENT
BADVEL_INTER_STUDENT_INCIDENT (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 21, 2024, 12:13 PM IST

Badvel Inter Student Died In Petrol Attack At Ysr Kadapa District : రాష్ట్రంలో సంచలనం కలిగించిన ఇంటర్‌ విద్యార్థి కేసులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. సంఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకోగలిగారు. నిందితుడు తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసినా వలపన్ని పట్టుకున్నారు. వైఎస్సార్​ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ప్రత్యేక దృష్టి సారించి సంఘటనా స్థలానికి స్వయంగా వెళ్లడంతో పాటు సిబ్బందికి తగిన సూచనలు చేసి కేసును తక్కువ వ్యవధిలోనే ఛేదించారు.

శనివారం (అక్టోబర్​ 19న) మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఘటన బాహ్య ప్రపంచానికి తెలిసింది. ఈ లోపు సీఎం చంద్రబాబు స్పందించి ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. బాధితురాలిని బతికించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకోవాలని సూచించారు. బాధితురాలిని స్థానికంగా చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు (Kadapa RIMS) తరలించారు. పెట్రోలుతో తగులబెట్టిన కారణంగా బాలిక శరీరం 80 % వరకు కాలిపోయినట్లు వైద్యులు గుర్తించారు. చికిత్సకు కోలుకోలేని బాలిక ఆదివారం (అక్టోబర్​ 20న) వేకువ జామున 2.30 గంటలకు ప్రాణాలు కోల్పోయింది.

బద్వేల్‌లో పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి

లైంగిక దాడి, ఆపై పెట్రోల్‌ పోసి లైటర్‌తో కాల్చి :ఇంటర్‌ యువతిని ప్రేమించిన విఘ్నేష్‌ మరో మహిళను 6 నెలల కింద వివాహం చేసుకున్నారని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు పేర్కొన్నారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని బాధితురాలు తరచూ నిలదీస్తుండేదని పోలీసు విచారణలో నిందితుడు తెలిపారు. ఈ తరుణంలో బాధితురాలిని వదిలించుకోవాలనే ఎత్తుగడ వేశాడు. శనివారం (అక్టోబర్​ 19) ఉదయం ఫోన్‌ చేసి పీపీ కుంట ప్రాంతానికి రావాలని కోరడంతో పాటు రాకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో బాధితురాలు విఘ్నేష్​ సూచించిన ప్రాంతానికి ఆటోలో వెళ్లింది.

పక్క ప్రణాళికతోనే : కడపలో ఓ హోటల్‌లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్న విఘ్నేష్‌ ఈ లోపు బైక్​లో బయలుదేరారు. పక్కా ప్రణాళికతో సీసాలో పెట్రోలు నింపుకొని జేబులో పెట్టుకుని వెళ్లారు. పీపీ కుంట ప్రాంతంలో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం తన పెళ్లి విషయమై బాధితురాలు ప్రశ్నించడంతో తీవ్రంగా దాడి చేశాడు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత బాధితురాలిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి వెళ్లిపోయినట్లు నిందితుడు పోలీసుల ముందు అంగీకరించాడు.

ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి నిందితుడైన విఘ్నేష్​ విశ్వప్రయత్నాలు చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. నిందితుడు ఫోన్‌ తీసుకెళ్తే కాల్‌డేటా, సిగ్నల్‌ ఆధారంగా గుర్తించే అవకాశం ఉంటుందని భావించాడు. ఈ క్రమంలోనే తన ఫోన్​ను కడపలో ఉంచి భార్య ఫోన్‌ను వెంట తీసుకెళ్లాడు. తన ఫోన్‌లోని కాల్‌ డేటాను తొలగించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

"ఇంటర్ విద్యార్థిని కేసు" - నిందితుడికి విధించే శిక్ష వేరొకరికి భయం కలిగించాలన్న సీఎం

నాలుగు బృందాలతో రంగంలోకి దిగిన పోలీసులు : బాలికపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన తర్వాత అక్కడి నుంచి కడప నగరానికి నిందితుడు చేరుకున్నాడు. ఈ క్రమంలోనే జనంలో కలిసిపోయే ప్రయత్నం చేశారు. కేసు విచారణ నిమిత్తం నాలుగు బృందాలతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్‌ పలుచోట్ల సేకరించారు. కడపలోని ఓ పెట్రోల్‌ బంకులో బైక్​లో పెట్రోల్‌ నింపుకోవడం, ఆ తర్వాత సీసాలో ప్రత్యేకంగా పట్టుకోవడాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో అనుమానంతో పోలీసులు కూపీ లాగగా వ్యవహారం బయటపడింది.

ప్రత్యేక బృందాల పనితీరు :నేరం జరిగిన ప్రాంతంలో పలు ఆధారాలను పోలీసులు సేకరించారు. మృతురాలి బట్టలు, బాలిక తరగతి పుస్తకాలున్న బ్యాగు, సగం కాలిన పెట్రోల్‌ సీసా, సంఘటనా స్థలంలో నిందితుడు తాగిపడేసిన సిగరెట్‌ పీకను గుర్తించారు. శనివారం (అక్టోబర్​ 19న) రాత్రే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సాంకేతిక వివరాలన్నీ సేకరించిన తర్వాత ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ప్రత్యేక బృందాలు నిందితుడిని గంటల వ్యవధిలోనే పట్టుకోవడం, నేరం జరిగిన తీరును తెలుసుకోగలిగారు. ప్రత్యేక బృందాల పనితీరును రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసించింది. ప్రత్యేకించి డీజీపీ ద్వారకా తిరుమలరావు వారిని అభినందించారు.

రిమ్స్‌లో విషాదం : కడప రిమ్స్‌ మార్చురీ వద్ద విషాదం నెలకొంది. మృతురాలి తల్లి రోదన స్థానికులను సైతం కంటతడి పెట్టించాయి. విషాదంలో ఉన్న బాలిక తల్లి బోరున విలపించింది. నిందితుడిని చంపేయాలంటూ పోలీస్​ అధికారులను వేడుకుంది. లేదంటే తానే పెట్రోల్‌ పోసి నిందితుడిని చంపేస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

పెళ్లి చేసుకోవాలని యువతి కోరడంతోనే తగులబెట్టాడు: ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు

ABOUT THE AUTHOR

...view details