Ayyanna Patrudu Unanimously Elected as Speaker of AP Assembly Speaker :అయన్నపాత్రుడు ముక్కుసూటిగా మాట్లాడతారు. కచ్చితత్త్వానికి పెట్టింది పేరు. దశాబ్దాల రాజకీయ అనుభవం ఆయన సొంతం. రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని నేటి వరకూ ఆయన వీడలేదు. తెలుగుదేశం కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతో మంది సీనియర్లు పక్క చూపులు చూసినా ఆయన పార్టీకి అండగా ఉన్నారు. పార్టీ శ్రేణుల స్థైర్యం దెబ్బతినకుండా ధైర్యవచనాలు చెప్పారు. పార్టీ కోసం అంత నిబద్ధత చూపినందుకే నేడు స్పీకర్ పదవి ఆయన్ని వరించింది.
హిందూ కుటుంబానికి చెందిన చింతకాయల అయ్యన్న పాత్రుడు 1957 సెప్టెంబరు 4న ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నంలో జన్మించారు. అయ్యన సతీమణి పద్మావతి. వీరికి విజయ్, రాజేష్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా (MLA) గా ప్రాతినిథ్యం వహిస్తున్న అయ్యన్నపాత్రుడుకి నాలుగు దశాబ్దాలకుపైగా రాజకీయ అనుభవం ఉంది. 1983లో తెలుగుదేశం ఆవిర్భావంతో ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన ఒకసారి ఎంపీగా కూడా పని చేశారు. 11వ లోక్‌సభకు అనకాపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1983 నుంచి ఇప్పటి వరకూ దాదాపు 10సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఏడు సార్లు గెలుపొందారు. తాజా ఎన్నికల్లో 24 వేల 646 మెజారిటీతో విజయం సాధించారు.