Ayushman Bharat Health Card Distribution in Mahabubnagar : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డుల జారీ జోరుగా కొనసాగుతోంది. గత ఏడాది జులై నుంచే దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌లో భాగంగా ఆభా కార్డుల జారీ కొనసాగుతున్నా ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఈ ప్రక్రియ ఊపందుకుంది. వైద్యం కోసం వచ్చే రోగులకు ప్రభుత్వాసుపత్రి సిబ్బంది ఉచితంగా ఆభా కార్డులు జారీ చేస్తున్నారు. ఈ కార్డు ద్వారా ఏ ప్రభుత్వాసుపత్రిలోనైనా ఉచితంగా వైద్య సేవలు పొందొచ్చు. 5 లక్షల వరకు వైద్య బీమా వర్తిస్తుంది.
దీంతో పాటు రోగి ఆరోగ్య చరిత్ర మొత్తం ఈ ఖాతాలో నిక్షిప్తమై ఉంటుంది. ఒకసారి ఖాతా తెరిచాక రోగి ఎన్ని ఆసుపత్రులకు వెళ్లినా, పూర్వ ఆరోగ్య చరిత్ర అంటే ఏ ఆసుపత్రులకు వెళ్లారు, ఏ రోగానికి చికిత్స తీసుకున్నారు, ఏ మందులు వాడారు, ఏ పరీక్షలు చేసుకున్నారు. ఇలాంటివన్నీ ఆ ఖాతాలో నమోదై ఉంటాయి. దీనివల్ల వైద్యులకు రోగి సమస్యను అర్థం చేసుకోవడం, వైద్యం చేయడం సులువవుతుంది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, అలంపూర్, గద్వాల, వనపర్తి, నారాయణపేట, కోస్గీ సర్కారు దవాఖానాల్లో ఆభా కార్డుల జారీతో పాటు ఆయుష్మాన్ భారత్ సేవల్ని అందిస్తున్నారు.
స్కిప్ ద క్యూ సేవలు : ఆభా సేవలు పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్‌లోని సమాచారంతోనే ఆభా కార్డు జారీ అవుతుంది. ఆభాలోని సమాచారాన్ని ఆసుపత్రితో పంచుకుంటే, రోగికి సీఆర్ నంబర్ వస్తుంది. ఇది రోగికి శాశ్వత సంఖ్య. ఆభా కార్డు పొందిన వాళ్లు ఏ ఆసుపత్రికి వెళ్లి వైద్యం పొందినా శాశ్వత సీఆర్ నంబర్ పైనే నమోదు అవుతుంది. ఆభా ఖాతా ఉంటే ఓపీ రిజిస్ట్రేషన్ కోసం క్యూలో నిలబడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంటి దగ్గరి నుంచి లేదా ఆసుపత్రికి వెళ్లి అక్కడ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా బయటి రోగులు టోకెన్లు పొందొచ్చు. అందుకోసం ముందుగా ఆభా యాప్‌ను మొబైల్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఓపీ కౌంటర్‌లో టోకెన్ నంబర్ చెబితే క్షణాల్లో ఓపీ స్లిప్ అందిస్తారు. ఆసుపత్రి క్యూఆర్ కోడ్‌ను ఫోన్‌లో భద్రపరిచి పెట్టుకుంటే ఇంటి దగ్గరి నుంచే టోకెన్ నంబర్లు జనరేట్ చేసుకోవచ్చు. సాధారణంగా గతంలో ఓపీ రిజిస్ట్రేషన్ కోసం ఒక్కో రోగికి 5 నుంచి 10 నిమిషాల సమయం పట్టేది. అలా కాకుండా టోకెన్ నంబర్ చెబితే క్షణాల్లో ఓపీ స్లిప్ అందిస్తారు. ఈ విధానం వల్ల రోగి క్యూలైన్లలో వేచి ఉండకుండా నేరుగా వైద్యుని కోసం వెళ్లొచ్చు.