ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఈనాడు' కార్యాలయంపై ఎమ్మెల్యే అనుచరుల దాడి - తాళాలు బద్దలు కొట్టేందుకు యత్నం

Attack on Eenadu Local Office in Kurnool: కర్నూలు 'ఈనాడు' లోకల్ కార్యాలయంపై పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. వందలమంది అనుచరులు పాల్గొని, కార్యాలయంపై రాళ్లు విసిరారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. జై జగన్, జై కాటసాని అంటూ నినాదాలు చేశారు. వైసీపీ జెండాలు చేత పట్టుకుని 'ఈనాడు' ప్రతులు దగ్ధం చేశారు.

Attack_on_Eenadu_Local_Office_in_Kurnool
Attack_on_Eenadu_Local_Office_in_Kurnool

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 20, 2024, 7:22 PM IST

Updated : Feb 21, 2024, 6:31 AM IST

'ఈనాడు' కార్యాలయంపై ఎమ్మెల్యే అనుచరుల దాడి

Attack on Eenadu Local Office in Kurnool: కర్నూలు నగర నడిబొడ్డున రాజ్‌ థియేటర్‌ ఎదురుగా ఉన్న ‘ఈనాడు ’ కార్యాలయం వద్ద మంగళవారం సాయంత్రం తీవ్ర భయాందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ‘ఆయన వైకాపా సీనియర్‌ మేత’ శీర్షికన ‘ఈనాడు’ పత్రికలో మంగళవారం కథనం ప్రచురితమైంది. దీనికి నిరసనగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అనుచరులు సుమారు 250మంది సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో ఒక్కసారిగా ‘ఈనాడు ’ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. గట్టిగా కేకలేస్తూ గందరగోళం సృష్టించారు. మొదటి అంతస్తులోని కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు, తాళాలు బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు. పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న రాళ్లను విసిరారు. బయట ఉన్న పూలకుండీలను పగలగొట్టారు. కార్యాలయ బోర్డును, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు.

వైకాపా మూకలు దాడికి వస్తున్నట్లు సమాచారం అందడంతో ‘ఈనాడు’ కార్యాలయంలోని సిబ్బంది అందరూ బయటకు వచ్చి తాళం వేయడంతో పెనుముప్పు తప్పినట్లైంది. 40 మంది పోలీసులు వచ్చినా ఆందోళనకారులు లెక్క చేయలేదు. వారు అల్లరిమూకలను నిలువరించడంతో విధ్వంసాన్ని కొంతవరకు అడ్డుకోగలిగారు. సాయంత్రం ఆరున్నరకు బీభత్సకాండ కొనసాగింది. ‘జైవైకాపా’, ‘జైజైకాటసాని’ ‘కాటసాని నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ బైఠాయించి నినాదాలు చేశారు. ఓ పక్క విధ్వంసానికి పాల్పడుతూనే మరోపక్క ‘వుయ్‌వాంట్‌ జస్టిస్‌’, ‘రామోజీనిఅరెస్టు చేయాలి’ అంటూ నినాదాలు చేశారు. ‘ఈనాడు’ పత్రిక ప్రతులను చించేసి తగలబెట్టారు.

వైకాపా శ్రేణుల ఉన్మాద చర్యలతో ఆవీధిలోని వ్యాపారులు, ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. తమ సంస్థలపైనా దాడికి దిగుతారేమోనని దుకాణాలు మూసేశారు. రాజ్‌థియేటర్‌ మార్గంలో గంటపాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. వైకాపా నాయకులు అక్కిమి హనుమంతరెడ్డి,రమణారెడ్డి, శివారెడ్డి, బెల్లంమహేశ్వరరెడ్డి, మిడుతూరు శ్రీనివాసులు, కల్లూరు రంగప్ప, కార్పొరేటర్లు శ్వేతారెడ్డి, ఐజా అరుణ, లక్ష్మీరెడ్డి, దండులక్ష్మీ కాంతరెడ్డి, సానా శ్రీనివాసులు, నారాయణరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, మైటాపు నర్సింహులు తదితరులు దాడికి వచ్చిన వారిలో ఉన్నట్లు గుర్తించారు.

మరో 50 రోజుల్లో ముగింపు పలుకుతాం: కర్నూలు ఈనాడు కార్యాలయంపై దాడిని ఖండిస్తూ గవర్నర్, కేంద్ర హోంమంత్రికి ట్యాగ్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని జగన్ అనుచరులను రెచ్చగొడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం ప్రజల్ని భయపెట్టే చివరి ప్రయత్నం అని అన్నారు. ఏపీలో మునుపెన్నడూ లేనివిధంగా శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హింసాత్మక చర్యలకు మరో 50 రోజుల్లో ముగింపు పలుకుతామని తెలిపారు.

వైసీపీ మూకదాడి అమానుషం:కర్నూలులోని ‘ఈనాడు’ ప్రాంతీయ కార్యాలయంపై వైసీపీ మూక దాడి అమానుషమని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) ఖండించారు. ఇటీవల రాప్తాడులోఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై దాడిని ఖండిస్తున్నట్టు చెప్పారు. ఇవి ఉద్దేశ్య పూర్వకంగానే చేస్తున్న దాడులు అని పేర్కొన్నారు.‘‘పత్రికా స్వేచ్ఛను వైసీపీ హరిస్తోందనడానికి ఈ దాడులే నిదర్శనం అని మండిపడ్డారు.

నిజాలు జీర్ణించుకోలేక నిందలు మోపడం, దాడులకు దిగడం, కొట్టి చంపడం అధికార పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. జర్నలిస్టులు, పత్రికా కార్యాలయాలపై దాడులకు పాల్పడటం వైసీపీ పాలనలో నిత్యకృత్యం అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రికా ప్రతినిధులపై దాడి అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్టే అని పేర్కొన్నారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని షర్మిల డిమాండ్‌ చేశారు. అదే విధంగా ఇటీవల గాయపడిన ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్​కు క్షమాపణ చెప్పాలన్నారు.

మీడియా ల‌క్ష్యంగా కాల‌కేయ సైన్యం దాడులు:సైకో జ‌గ‌న్ కాల‌కేయ సైన్యం మీడియా ల‌క్ష్యంగా దాడుల‌కు తెగ‌బ‌డుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) మండిపడ్డారు. అనంత‌పురం స‌భ‌లో ఆంధ్ర‌జ్యోతి ఫోటోగ్రాఫ‌ర్‌ని అంతం చేయ‌డానికి ప్ర‌య‌త్నించిందని విమర్శించారు. ఇప్పుడు ఏకంగా ఈనాడు క‌ర్నూలు కార్యాల‌యంపైకి పాణ్యం ఎమ్మెల్యే కాట‌సాని రాంభూపాల్ రెడ్డి తన వైసీపీ రౌడీమూక‌ల్ని వ‌దిలాడని లోకేశ్ మండిపడ్డారు.

నిష్ఫాక్షిక స‌మాచారం అందించే ఈనాడు వంటి అగ్ర‌శ్రేణి దిన‌ప‌త్రిక కార్యాల‌యంపై వైసీపీ దాడుల‌కు తెగ‌బ‌డ‌డం రాష్ట్రంలో ఆట‌విక పాల‌న‌కి ప‌రాకాష్ట‌ అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్ర‌జాస్వామ్యానికి మూల‌స్తంభంలాంటి మీడియాపై సైకో జ‌గ‌న్ ఫ్యాక్ష‌న్ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.

వైసీపీ పాలనలో పత్రికా స్వేచ్ఛకు సమాధి కట్టారు: కర్నూలులో ఈనాడు కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) తెలిపారు. వైసీపీ పాలనలో పత్రిక స్వేచ్ఛకు సమాధి కట్టారన్నారు. జగన్ రెడ్డి తన పెంపుడు కుక్కలను పిచ్చి కుక్కలుగా మార్చి రోడ్లపైకి వదిలాడని మండిపడ్డారు. అరాచకాలు, అక్రమాలను ఎప్పటికప్పుడు ఎండకడుతున్న పత్రికా విలేకరులపై, సంస్థలపై దాడులు చేసే నీచ సంస్కృతిని జగన్ రెడ్డి అనుసరిస్తున్నాడని ధ్వజమెత్తారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలతో వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. ప్రముఖ పత్రికా కార్యాలయంపై దాడి జరిగిందంటే రాష్ట్రంలో సామాన్య ప్రజలకు ఏం రక్షణ ఉంటుందని ప్రశ్నించారు. ఈనాడు కార్యాలయంపై దాడి జరుగుతుంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందని అన్నారు. పత్రికా కార్యాలయంపై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, జగన్ రెడ్డి చేస్తున్న అరాచకాలకు అంతకంతకు వడ్డీతో సహా బదులు చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.

సిద్ధం సభలో ఏబీఎన్​ ఫోటోగ్రాఫర్​పై దాడి హేయం : టీడీపీ

పత్రికా స్వేచ్ఛను హరించేందుకే:కర్నూలు ఈనాడు కార్యాలయంపై దాడిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. పోలీసుల సమక్షంలోనే వైసీపీ మూకల బీభత్సం అరాచక పాలనకు అద్దంపడుతోందని అన్నారు. పత్రికా స్వేచ్ఛను హరించేందుకు జగన్ ప్రభుత్వం యత్నిస్తోందని విమర్శించారు. వైసీపీ అరాచకాలపై ప్రజలకు జగన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రాక్షస పాలనకు నిదర్శనం:ఈనాడు కార్యాలయంపై దాడి రాష్ట్రంలో రాక్షస పాలనకు నిదర్శనమని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు (Prathipati Pulla Rao) మండిపడ్డారు. సీఎం జగన్ ఫ్యాక్షన్‌ నైజానికి వరుస దాడులు అద్ధం పడుతున్నాయని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, పాత్రికేయులకు కనీస రక్షణ ఉందా? లేదా? అని ప్రశ్నించారు. మీడియాను అణచివేయాలనే జగన్‌ కుట్రలో భాగంగానే దాడులు జరుగుతున్నాయని, ప్రశ్నించే పత్రికలే లేకుంటే రాష్ట్రాన్ని జగన్ ఎప్పుడో అమ్మేసేవారని అన్నారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?: ఒక దుర్మార్గుడి అరాచక పాలనతో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని టీడీపీ నేత దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు ప్రజాస్వామ్యంపై దాడి చేశారని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? పోలీసు యంత్రాంగం పనిచేస్తోందా? అని దేవినేని ఉమ ప్రశ్నించారు.

పోలీసుల వైఫల్యంతోనే వరుస దాడులు: తప్పులు సరిదిద్దుకోకుండా వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని మాజీమంత్రి పరిటాల సునీత (Paritala Sunitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వైఫల్యంతోనే పత్రికా కార్యాలయాలపై వరుస దాడులు చేస్తున్నారని అన్నారు. వైసీపీ మనుగడ కొద్ది రోజులేనని ఆ పార్టీ నేతలు గుర్తించాలని హితవు పలికారు. ఈనాడు కార్యాలయంపై దాడి హేయమైన చర్య అని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.

పత్రికా స్వేచ్ఛకు ముప్పు వాటిల్లింది: కర్నూలు ఈనాడు కార్యాలయంపై దాడిని ఏపీడబ్ల్యూయూజే ఖండించింది. వైసీపీ పాలనలో పత్రికా స్వేచ్ఛకు ముప్పు వాటిల్లిందని ఏపీడబ్ల్యూయూజే (Andhra Pradesh Union of Working Journalists) పేర్కొంది. దాడికి పాల్పడిన నిందితులను అరెస్టు చేయాలని కోరింది.

కర్నూలు ఈనాడు కార్యాలయాన్ని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు పరిశీలించారు. సీఎం ప్రోద్బలంతోనే వైసీపీ నేతలు బరితెగిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌, కర్నూలు ఈనాడు కార్యాలయంపై దాడి దుర్మార్గమన్నారు. మీడియా కార్యాలయాల మీద దాడులపై జగన్ స్పందించాలని కోరారు. దాడి చేసిన నిందితులపై హత్యాయత్నం కేసులు పెట్టి అరెస్టు చేయాలన్నారు.

నిరంకుశ వైఖరికి ప్రత్యక్ష ఉదాహరణ: కర్నూలు ఈనాడు కార్యాలయంపై, అదే విధంగా ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై దాడులు ప్రభుత్వ నిరంకుశ వైఖరికి ప్రత్యక్ష ఉదాహరణ అని బీజేపీ నేత వల్లూరు జయప్రకాశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దాడులకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, పత్రికా కార్యాలయాలపై దాడులు వైసీపీ పాలనలో నిత్యకృత్యంగా మారాయన్నారు. పత్రికలపై దాడి అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే అని వల్లూరు జయప్రకాశ్‌ మండిపడ్డారు.

'మీడియాపై జగన్ ఫ్యాక్షన్ దాడి'- రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల నిరసన గళం

Last Updated : Feb 21, 2024, 6:31 AM IST

ABOUT THE AUTHOR

...view details