Assigned Lands Identification in Saraswati Power Industries Lands:పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల్లో అసైన్డ్ భూములు ఉన్నట్లు రెవిన్యూ అధికారులు గుర్తించారు. మాచవరం మండలం వేమవరం గ్రామ పరిధిలో 20 ఎకరాల అసైన్డ్ భూములు సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కింద ఉన్నట్లు తేల్చారు. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ యాజమాన్యంతో పాటు అసైన్డ్ రైతులు, అమ్మకానికి సహకరించిన మధ్యవర్తులకు నోటీసులు జారీ చేశారు. గురజాల నియోజకవర్గం పరిధిలోని మాచవరం, దాచేపల్లి మండలాల పరిధిలో 15 వందల ఎకరాలకు పైగా భూములను సరస్వతి సంస్థ కోసం అప్పట్లో వైఎస్ ప్రభుత్వం కేటాయించింది.
ఇందులో అసైన్డ్ భూములు, అటవి భూములతో పాటు సహజ వనరులు కూడా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల క్షేత్రస్థాయిలో పర్యటించారు. రెవిన్యూ, అటవిశాఖల అధికారులతో సర్వే కూడా చేయించారు. అధికారులు జరిపిన పరిశీలనలో 20 ఎకరాల అసైన్డ్ భూములను రైతుల నుంచి సరస్వతి సంస్థ కొనుగోలు చేసినట్లు తేలింది. చట్టప్రకారం అసైన్డ్ భూములు అమ్మటానికి, కొనటానికి వీల్లేదు. అయినప్పటికీ జగన్ కుటుంబానికి చెందిన సరస్వతి సంస్థ వాటిని కొనుగోలు చేసింది. అందుకే రైతుల వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. రైతులను బెదిరించి ఏమైనా భూములు కొన్నారా అనే కోణంలో విచారణ సాగుతోంది.