Gorintaku Festival Celebration 2024 in Telangana :ఆషాఢ మాసం అమ్మవారికి ప్రత్యేకం. వర్షాలు కురిసే ఈ సమయంలో అమ్మవార్లకు బోనాల వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి శాకంబరీ ఉత్సవాలు సందడిగా సాగుతాయి. ఇక ఇదే మాసంలో ఆడపడుచులు ఒక్క చోట చేరి ఎంతో ఇష్టంగా గోరింటాకు పెట్టుకుంటారు.
Health Benefits Of Gorintaku :ఎర్రగా పండిన తమ చేతులను చూసి మురిసిపోతారు. ప్రకృతి హితమైన గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని చేతులు, పాదాలకు పెట్టుకోవడం వల్ల శరీరంలో ఉండే వేడి, వాతం తగ్గుతాయని పెద్దలు చెబుతారు. అందుకే మహిళలు గోరింటాకు పెట్టుకోవడానికి ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు.
వరంగల్లో ఘనంగా గోరింటాకు సంబారాలు :ఆషాఢ మాసం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో గోరింటాకు సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తాండవ కృష్ణ సంగీత అకాడమీ ఆధ్వర్యంలోనూ, పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్ధానంలోనూ ఈ వేడుకలు నిర్వహించారు. 150మందికి పైగా మహిళలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఉత్సాహంగా పాటలు పాడి సంబురాలు చేసుకున్నారు. ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటూ ఆనందంగా గడిపారు.