Archerychampion Trinath Success Story:విలువిద్యలో రాణించాలంటే కఠోర సాధనతో పాటు ఎంతో ఏకాగ్రత ఉండాలి. అలాంటి క్రీడలో అవలీలగా రాణిస్తున్నాడు ఈ యువకుడు. గురిపెడితే బాణం లక్ష్యాన్ని చేరాల్సిందే అన్నట్లుగా ప్రతిభ కనబరుస్తున్నాడు. చదువులో రాణిస్తూనే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ విలువిద్యలో పట్టుసాధించాడు. అనతి కాలంలోనే ప్రపంచ వేదికలపై సత్తాచాటి ప్రముఖుల మన్ననలు పొందుతున్నాడు ఈ యువ క్రీడాకారుడు.
విజయవాడలోని మొగల్రాజపురానికి చెందిన పెండ్యాల లక్ష్మణ్, పూర్ణ దంపతుల ఏకైక కుమారుడు త్రినాథ్ చౌదరి. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో బాణాలు ఎక్కుపెడుతూ పతకాలు కొల్లగొడుతున్నాడు. ఇటీవల ఇంటర్ పూర్తిచేసిన త్రినాథ్‌కు చిన్నతనం నుంచి క్రీడలంటే అమితాసక్తి. స్విమ్మింగ్, స్కేటింగ్లో ప్రాథమిక నైపుణ్యాలు నేర్చుకున్న ఈ యువకుడికి అనూహ్యంగా ఆర్చరీపై దృష్టిమళ్లింది. సరదాగా మొదలైన ఈ క్రీడనే ఈ యువకుడిని ఇప్పుడు అత్యున్నత శిఖరాలకు చేర్చుతోంది.
కూచిపూడిలో గిరిజన బిడ్డల ప్రతిభ- దేశ విదేశాల్లో అద్భుత ప్రదర్శనలు - Kuchipudi in Srikakulam district
నగరంలోని చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీలో శిక్షణ కోసం చేరిన త్రినాథ్ అతి తక్కువ కాలంలోనే ఆటపై పట్టు సాధించాడు. 2018, 2019లో జాతీయ మినీ ఆర్చరీ ఛాంపియన్ షిప్‌లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2021లో ఓల్గా ఆర్చరీ అకాడమీలో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్ పోటీల్లో కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో ప్రథమస్థానంలో నిలిచాడు. అదే ఏడాది డెహ్రాడూన్‌లో జాతీయస్థాయి జూనియర్, జమ్ము-కాశ్మీర్‌లో జాతీయస్థాయి పోటీలో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
ఆర్చరీలో రాణించాలంటే ఏకాగ్రత, నిరంతర సాధన ముఖ్యమని చెప్తున్నాడు త్రినాథ్. 2022లో మధ్యప్రదేశ్ నర్మదాపూర్‌లో నిర్వహించిన ఎన్‌ఆర్‌ఏటీ పోటీలో తలపడి మూడో స్థానంలో నిలవగా దిల్లీలో జరిగిన ఎన్‌ఆర్‌ఏటీ ఫైనల్లో కాంపౌండ్ వ్యక్తిగత ఒలింపిక్ రౌండ్లో పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో చెన్నైలో జరిగిన 'ఖేలో ఇండియా' యూత్ గేమ్స్ మిక్స్‌డ్ విభాగంలో రజత పతకం సాధించాడు.