APSRTC Provided Special Buses For Karthika Masam to Visit Lord Shiva Temples : అత్యంతపవిత్రమైన కార్తిక మాసం నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. ఇది నవంబరు 30న ముగుస్తుంది. ఈ నెలలో పరమ శివుడికి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. కార్తిక సోమవారం రోజు శైవక్షేత్రాలను దర్శిస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో శివాలయాలకు వెళ్లే భక్తుల రద్దీ దృష్ట్యా పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.
గత ఏడాది కార్తిక మాసంలో ఎక్కువ మంది భక్తులు పంచారామాలు, త్రిలింగ దర్శిని ప్యాకేజీలను వినియోగించుకున్నారు. ఈ ప్యాకేజీలతోపాటు వనభోజనాలు, ఆలయాల సందర్శన కోసం కూడా చాలా మంది వ్యక్తిగతంగా ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకున్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఆదాయం సమకూరింది. ఈ ఏడాది కూడా గత ఏడాది కంటే ఎక్కువ సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కార్తిక పౌర్ణమి వేళ వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ - తెల్లవారుజాము నుంచే పుణ్య క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
ఈ సారి 350 ఆర్టీసీలు సిద్ధం :ఎన్టీఆర్ జిల్లా నుంచి పంచారామాలు, శైవ క్షేత్రాలకు ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 350 ప్రత్యేక బస్సులు వేశారు. ఈసారి డిమాండ్ ఎక్కువగా ఉండొచ్చని గతం కంటే సర్వీసులను పెంచారు. పంచారామాల ప్యాకేజీలో భాగంగా ఒకే రోజు అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామ, సామర్లకోటలో క్షేత్రాలను దర్శించుకునే వీలుంది. ఉమ్మడి కర్నూలు జిల్లా యాగంటి, మహానంది, శ్రీశైలం ఆలయాలకు ఒకటిన్నర రోజులో వెళ్లి వచ్చేలా త్రిలింగ దర్శిని ప్యాకేజీని సైతం తయారు చేశారు. వీటితోపాటు అన్నవరం, శ్రీశైలం, కొండవీడు, కర్ణాటకలోని దేవనహళ్లి తదితర ఆలయాలకు వేరుగా బస్సులు నడుపుతున్నారు. డిమాండ్‌ను బట్టి అరుణాచలం, సముద్ర స్నానాలకు కూడా బస్సులను తిప్పనున్నారు.
రికార్డు స్థాయిలో ఆదాయం :గత ఏడాది కార్తిక మాసంలో స్పెషల్ బస్సులు భక్తులతో కిటకిటలాడాయి. జిల్లా నుంచి పలు శైవ క్షేత్రాలకు ఆర్టీసీ అధికారులు 301 బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేశారు. ఎన్నడూ లేనివిధంగా ఆర్టీసీకి రూ.86.44 లక్షల రాబడి వచ్చింది. ఓఆర్ 87 శాతం నమోదైంది. ఒక కిలోమీటరుకు రూ.58.72 జమ అయ్యింది. కొవిడ్‌కు ముందు 2019లో వచ్చిన ఆదాయం కంటే ఇది ఎక్కువ. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ రద్దీ ఉంటుందని ఆర్టీసీ అధికారులు అంచనాలు వేస్తున్నారు. దానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు.
కార్తికమాసం తొలి సోమవారం- శివాలయాల్లో పోటెత్తిన భక్తులు