APSRTC Passengers Faced Bus Problems:గంటల తరబడి బస్సు కోసం ఎదురుచూపులు. చిన్నపిల్లల రోదనలు, వృద్ధుల ఇబ్బందులు, మహిళల తీవ్ర ఇక్కట్లు. ఇవన్నీ ఎక్కడ అనుకుంటున్నారా. ఏలూరు జిల్లాలోని కొత్త బస్టాండ్లో అవిష్కృతమైన ఘటనలివీ. గంటల తరబడి బస్టాండ్లో ఎదురుచూసినా ఒక్క బస్సైనా రావడం లేదని ఆర్టీసీ ప్రయాణికులు ఆవేదనకు లోనయ్యారు. గంటలు గంటలు వేచి చూస్తే వచ్చిన ఒక్క బస్సును పదుల సంఖ్యలో ఉన్న ప్రయాణికులు ఎన్నో తంటాలు పడుతూ ఎక్కాల్సి వచ్చిందంటూ అసహనానికి లోనయ్యారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జిల్లా పర్యటనకు వచ్చారంటే తమకు ఇబ్బందులు తప్పడం లేదంటూ ఆర్టీసీ ప్రయాణికులు వాపోతున్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలకు, ప్రజలను తరలించడానికి ఆర్టీసీ బస్సులను, ప్రైవేట్ వాహనాలను వందల సంఖ్యలో వినియోగించడం వల్ల ఈ సమస్య తలెత్తుతోంది. దీని వల్ల వాహనాలు కొరత ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కోంటున్నారు. ఇదే తరహలో ఏలూరు జిల్లాలో ప్రయాణికులు నానా అవస్థలను చవి చూశారు.
గుంతల రోడ్లు - కాలం చెల్లిన బస్సులు - ఆర్టీసీ సిబ్బందికి ఇక్కట్లు
వందల సంఖ్యలో వాహనాల తరలింపు: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏలూరు జిల్లాలోని దెందులూరులో నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆ బహిరంగ సభకు ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల నుంచి ప్రజలను తరలించడానికి భారీ సంఖ్యలో వాహనాలు వినియోగించారు. ఇందులో ఆర్టీసీ బస్సులది ప్రధాన పాత్ర కాగా, పలు ప్రైవేటు విద్యాసంస్థల వాహనాలు, ఇతర వాహనాలు విరివిగా ఉపయోగించారు.