APSRTC MD Review on Sankranti Rush : ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల నేపథ్యంలో ఆర్టీసీ, రవాణా, పోలీసు శాఖ అధికారులతో సంస్థ ఎండీ ద్వారకా తిరుమల రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీపై సమీక్ష నిర్వహించారు. రద్దీ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. బస్టాండ్లలో ప్రయాణికులు నిరీక్షించకుండా వెంటనే అవసరమైన బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఇందుకోసం అవసరమైన చోట్ల ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులను తీసుకోవాలని అధికారులను ద్వారకా తిరుమల రావు ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించాలని పేర్కొన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులు సమకూర్చే బాధ్యత రవాణా శాఖ అధికారులు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. ఈ మేరకు రవాణా శాఖ కమిషనర్‌తో ఆయన మాట్లాడారు. నిరంతరం బస్సులు నడిపి ప్రయాణికులను సకాలంలో సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని ద్వారకా తిరుమల రావు ఆదేశాలు జారీ చేశారు.