APSRTC MD Dwaraka Tirumala Rao About Piracy Videos in Buses :ఆర్టీసీ బస్సుల్లో పైరసీ వీడియోలు, కొత్త సినిమాలు, అభ్యంతరకరమైన వీడియోలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు హెచ్చరించారు. నెల 11న ఆర్టీసీ అద్దె బస్సులో కొత్త సినిమా తండేల్ పైరసీ వీడియో ప్రదర్శించడంపై అందిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి కారకులపై చర్యలకు ఆయన ఆదేశించారు. ఆర్టీసీ సొంత బస్సులు, అద్దె బస్సుల్లో అనుమతి లేని వీడియోలు ఇకపై ప్రదర్శించరాదన్నారు. బస్సుల్లోని ఆండ్రాయిడ్ టీవీల్లో స్కీర్ మిర్రరింగ్, కాస్టింగ్, ఫైల్ షేరింగ్ ఆప్షన్లు తీసివేయాలని ఆయా డిపోల అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఆర్టీసీ సొంత బస్సులు, అద్దె బస్సుల్లోనూ అనుమతి లేని సినిమాలు, వీడియోలు, వెబ్ సీరీస్లు టీవీ షో లు ఎట్టి పరిస్ధితుల్లో ప్రదర్శించవద్దని ఆదేశిస్తూ అర్టీసీ ఆపరేషన్స్ ఈడీ అప్పలరాజు సర్క్యులర్ జారీ చేశారు. కేవలం అనుమతి పొందిన కంటెంట్ కలిగిన వీడియోలనే ప్రదర్శించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్త ఆర్టీసీ సహా అద్దె బస్సు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిపో అధికారులకు ఆదేశించారు. నిరంతరం నిఘా అధికారులు తనిఖీలు చేయాలని సూచించారు. డిపో అధికారులు సిబ్బందికి అవగాహన కల్పించాలని కోరారు. భవిష్యత్తులో పైరసీ సహా అనధీ కృత వీడియోల ప్రదర్శన జరిగినట్లు ఫిర్యాదులు వస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో అన్ని జిల్లాల్లోని డీపీటీవోలు, డిపో మేనేజర్లు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఆపరేషన్ ఈడీ అప్పల రాజు తెలిపారు.