APSRTC Chairman Konakalla Narayana Rao Has Ordered an Inquiry on Thandel Piracy :నాగచైతన్య , సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘తండేల్’. ఈ సినిమా ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలైంది. అప్పటి నుంచి దీన్ని పైరసీ భూతం వెంటాడుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో దీన్ని ప్రదర్శించడం చర్చనీయాంశమైంది.
నిర్మాత బన్నీ వాసు స్పందిస్తూ ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆ ఏపీఎస్‌ఆర్టీసీ సంస్థ ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆ సంస్థ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు తాజాగా దీనిపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై ఎంక్వైరీ చేసి పూర్తి వివరాలు సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
‘తండేల్’ పైరసీ సినీ ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీని గురించి ఆ సినిమా నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీవాసు ప్రెస్‌మీట్ నిర్వహించారు. పైరసీని ప్రోత్సహిస్తోన్న వారిపై మండిపడ్డారు. ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఆ పైరసీ ప్రింట్ ప్రదర్శించడం దారుణమని మండిపడ్డారు. చిత్ర విజయాన్ని ఆస్వాదించే సమయంలో ఇదొక ప్రతిబంధకం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు తెలిసి, మరికొందరు తెలియక ఇలా సినిమాల్ని పైరసీ చేస్తున్నారని, వాట్సప్, టెలిగ్రామ్ గ్రూప్స్‌లో ఆ లింక్స్‌ను ఫార్వర్డ్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అలా పైరసీ చేస్తున్న వారిని, దాన్ని ప్రోత్సహిస్తున్న వారిని గుర్తించి కేసులు పెడుతున్నామని, వాళ్లంతా జైలుకు వెళ్లే అవకాశముందని హెచ్చరించారు.