APPSC Violating Rules: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగుల పాలిట శాపంలా మారింది. వైసీపీ దాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి, ఉద్యోగార్థుల ఆశలను వమ్ము చేస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతోంది. 2018 గ్రూప్-1 నోటిఫికేషన్‌లో పేర్కొన్న దానికి భిన్నంగా డిజిటల్ విధానంలో జవాబుపత్రాలను మూల్యాంకనం చేసి, నియామకాల ప్రక్రియను పూర్తిగా అస్తవ్యస్తం చేసింది. నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని అభ్యర్థులు నెత్తీనోరూ కొట్టుకున్నా, తమను ఎవరేం చేస్తారన్న ధోరణిలో కమిషన్ మొండిగా వ్యవహరించింది. తమను సంప్రదించేందుకు వచ్చిన అభ్యర్థులపైనా విరుచుకుపడింది. ఫలితంగా 2020 డిసెంబరులో నిర్వహించిన ప్రధాన పరీక్షలను రానున్న మూడు నెలల్లోగా మళ్లీ నిర్వహించాల్సి వచ్చింది. 10 వేల మంది వరకు ఈ పరీక్షలు రాయనున్నారు.
హైకోర్టు ఆదేశాలతో ప్రస్తుతం గ్రూప్-1 అధికారులుగా ఉన్న 143 మంది ఉద్యోగాలు పొగొట్టుకున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 162 గ్రూప్-1 పోస్టుల భర్తీకి 2018 డిసెంబరు 31న నోటిఫికేషన్ వెలువడింది. అప్పుడు ప్రొఫెసర్ ఉదయ్‌భాస్కర్ ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా ఉన్నారు. తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో ఉదయ్‌భాస్కర్ పాత్ర నామమాత్రమైంది. కార్యదర్శిగా ఉన్న ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు గ్రూప్-1 పరీక్ష నిర్వహణ బాధ్యతలు చూశారు. డిజిటల్ విధానంలో కాకుండా మాన్యువల్‌గా జవాబుపత్రాలను మూల్యాంకనం చేయాలని హైకోర్టు ఆదేశాలు వెలువడి, తదుపరి చర్యలు తీసుకునే సమయంలో కమిషన్ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ గౌతం సవాంగ్ నియమితులయ్యారు.
2018 గ్రూప్-1 మెయిన్స్ రద్దు - ఏపీ హైకోర్టు కీలక తీర్పు
అభ్యర్థులు ప్రాధేయపడినా: గ్రూప్-1 పరీక్షకు లక్షా 14 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. 2019 మే 27న 59 వేల 200 మంది ప్రిలిమ్స్ పరీక్ష రాశారు. అదే ఏడాది జూన్‌లో ఫలితాలు విడుదల చేశారు. నిర్దేశిత నిష్పత్తి ప్రకారం వీరిలో 9 వేల 678 మందిని ప్రధాన పరీక్షలు రాసేందుకు అనుమతించారు. ఆ ఫలితాలను 2021 ఏప్రిల్ 28న వెల్లడించారు. తొలుత డిజిటల్ విధానంలో ఈ జవాబుపత్రాలను మూల్యాంకనం చేసి, 326 మందిని మౌఖిక పరీక్షలకు ఎంపిక చేశారు. జవాబుపత్రాలను నోటిఫికేషన్‌లో పేర్కొన్న దానికి భిన్నంగా డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేయడంతో అభ్యర్థులు నష్టపోయారని, మాన్యువల్ విధానంలోనే దిద్దాలని అభ్యర్థులు ప్రాధేయపడినా కమిషన్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది.
ఒకదశలో డిజిటల్ మూల్యాంకనం బాగా జరిగిందని కొంతమంది అభ్యర్థులతో ప్రభుత్వానికి మద్దతుగా సైతం మాట్లాడించారు. అప్పుడే అభ్యర్థుల వేడుకోళ్లను కమిషన్ పరిగణనలోకి తీసుకుని ఉంటే సమస్య ఇంత పెద్దదయ్యేది కాదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో మాన్యువల్ విధానంలో మాత్రమే ప్రధాన పరీక్షల జవాబుపత్రాలు దిద్దాలంటూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో సమస్య మరింత జటిలమైంది. కొవిడ్ కారణంగా డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేసినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. విచారణ అనంతరం హైకోర్టు మాన్యువల్ విధానంలో ప్రధాన పరీక్షల ప్రశ్నపత్రాలను దిద్దాలని ఆదేశించింది.
వైసీపీఎస్సీగా ఏపీపీఎస్సీ - అయినవారికే పదవులు
ఆధారాలతో సహా హైకోర్టులో పిటిషన్ దాఖలు: హైకోర్టు ఆదేశాల మేరకు ఒకసారి కాకుండా రెండు సార్లు మాన్యువల్ విధానంలో జవాబుపత్రాలను మూల్యాంకనం చేశారని పలువురు అభ్యర్థులు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. డిజిటల్ విధానంలో మౌఖిక పరీక్షల కోసం ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాలో చాలామంది పేర్లు మాన్యువల్ మూల్యాంకన ఫలితాల్లో లేవని వాపోయారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఒకసారి కాకుండా 2021 నవంబరు నుంచి 2022 ఫిబ్రవరి మధ్య రెండుసార్లు మాన్యువల్ విధానంలో జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారంటూ అభ్యర్థులు ఆధారాలతో సహా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.