YS Sharmila on Electricity Charges :విద్యుత్ ఛార్జీలపై గత ప్రభుత్వం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాల్సిది పోయి, ఆ పాపపు పరిహారాన్ని కూటమి సర్కార్ ప్రజల నెత్తినే మోపుతోందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. 18 వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలు వసూళ్ల విషయంలో తప్పేం లేదని ప్రభుత్వం చెప్పుకోవడం దారుణమన్నారు. భారం మోపింది తాము కాదంటూ, ప్రజల మీదే ఆ మొత్తాన్ని మోపుతున్నారని మండిపడ్డారు. ఇది సర్దుబాటు కాదని, ఇది ప్రజలకు సర్దుపోటని ఎద్దేవా చేశారు.
5 నెలల్లోనే 18 వేల కోట్లా:విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రభుత్వం ప్రజలకు భారీ కరెంటు షాక్ ఇచ్చిందన్నారు. వైఎస్సార్సీపీ చేసింది పాపం అయితే , రాష్ట్ర ప్రజలకు కూటమి సర్కార్ పెడుతున్నది శాపమని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ప్రజలకు ఏం సంబంధమని షర్మిల నిలదీశారు. ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తే పడే అదనపు భారం ప్రజల నెత్తిన మోపుతారా అని ప్రశ్నించారు. 5 ఏళ్లలో వైఎస్సార్సీపీ భారం 35 వేల కోట్లు అయితే, 5 నెలల్లో కూటమి భారం 18 వేల కోట్లా అని నిలదీశారు.