POWER CONTRACT WITH ADANI : కేంద్ర సౌరవిద్యుత్ సంస్థ -సెకి నుంచి 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనేందుకు నాటి జగన్ ప్రభుత్వం పేరుకే సెకితో ఒప్పందం చేసుకుంది. కానీ అసలు ఒప్పందం అదానీతోనేనని అనుబంధ ఒప్పందాలే చెప్పకనే చెబుతున్నాయి. మొత్తం విద్యుత్ ఉత్పత్తి అదానీ ప్లాంట్ల నుంచే జరగింది. అది అదానీ విద్యుత్ అనే విషయం గత ప్రభుత్వ పెద్దలకు ముందే తెలుసన్నది స్పష్టమవుతోంది. అంతేకాదు అమెరికా దర్యాప్తు సంస్థలు ఆరోపించినట్లు లంచాలపై స్పష్టత వచ్చాకే ఈ ఒప్పందం జరిగినట్లు నాటి పరిణామాల ద్వారా తెలుస్తోంది.
వైఎస్సార్సీపీ నేతల డొల్ల వాదన: కేంద్ర సౌరవిద్యుత్ సంస్థ -సెకి నుంచి 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సెకితోనే ఒప్పందం చేసుకుంటే అదానీకి ఏంటి సంబంధమని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆ ఒప్పందాలు కుదిరేందుకు అదానీ భారీగా లంచం ఇచ్చారని అమెరికా దర్యాప్తు సంస్థలు కోర్టులో అభియోగాలు నమోదుచేస్తే, దానికీ జగన్‌కూ ఎలా ముడిపెడతారు? సెకి కేంద్రప్రభుత్వ సంస్థ కదా? ఎక్కడైనా ప్రభుత్వ సంస్థలు లంచాలు ఇస్తాయా?’’ అని వైఎస్సార్సీపీ నాయకులు పదే పదే చెబుతున్నారు. కానీ ఇది డొల్ల వాదన అనేది స్పష్టమవుతోంది.
గవర్నర్‌ను కలిసిన వైఎస్ షర్మిల - ఎందుకంటే
తప్పు చేసి అడ్డంగా దొరికిపోవడమే కాకుండా దాన్ని సమర్థించుకునేందుకు వైఎస్సార్సీపీ నాయకులు అబద్ధాలు చెబుతూ, ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు అదానీ, అజూర్ సంస్థల పేర్లే తమకు తెలియవన్నట్టు, ఆ సంస్థలు విద్యుదుత్పత్తి చేస్తాయన్న విషయాన్ని మొదటిసారే వింటున్నట్టు అమాయకత్వం నటిస్తూ, నిస్సిగ్గుగా వినిపిస్తున్న వాదనలు ఈ మధ్య ఓ ఓటీటీ సిరీస్‌లో నేపథ్యగీతంగా వాడిన ‘సాంప్రదాయినీ సుప్పినీ శుద్ధ పూసనీ’ అన్న పాటను గుర్తుచేస్తున్నాయి.
నిబంధనలకు పాతర - అదానీ సంస్థతో విద్యుత్ ఒప్పందాలు
ఆ ఒప్పందాలే బలం చేకూరుస్తున్నాయి: ఎంతటి దొంగయినా ఏదో ఒక ఆధారం వదిలిపెడతాడు. దాని ఆధారంగానే పోలీసులు అతడి భరతం పడతారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డట్టు అమెరికా దర్యాప్తు సంస్థల నుంచి అభియోగాలు ఎదుర్కొంటున్న ‘కరెంటు దొంగలు’ అంతే. సెకితో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసుకున్న రెండు అనుబంధ ఒప్పందాలతో అలాగే దొరికిపోయారు. ఆ అనుబంధ ఒప్పందాలు సహా, ఆ స్కామ్‌కి సంబంధించిన ప్రతి దస్త్రం నకలును ‘ఈనాడు’ సంపాదించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సెకితో ఒప్పందం చేసుకున్నా, ఆ విద్యుత్ సరఫరా చేసేది అదానీ, అజూర్ సంస్థలేనని అప్పటి ప్రభుత్వ పెద్దలకు తెలుసు.
అనుబంధ ఒప్పందాలే దానికి సాక్ష్యం. సెకితో చేసుకున్న ప్రధాన ఒప్పందంలో అదానీ, అజూర్ సంస్థల పేర్లు కనిపించకుండా జాగ్రత్తపడినా, అనుబంధ ఒప్పందాల్లో వాటి ప్రస్తావన ఉంది. 7 వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసేదీ, భారీగా లబ్ధి పొందేదీ అదానీ సంస్థేనని అనుబంధ ఒప్పందాల్ని బట్టి క్లియర్‌గా తెలుస్తోంది. అదానీ నుంచి గత ‘ప్రభుత్వ పెద్దకు’ భారీగా లంచాలు అందిన తరువాతే పని పూర్తయిందనడానికి ఆ ఒప్పందాలే బలం చేకూరుస్తున్నాయి.
కేంద్రం ఇచ్చే రాయితీ కొంతే - సెకి విద్యుత్‌కు ఐఎస్‌టీఎస్ ఛార్జీలు చెల్లించాల్సిందే!
నాటి ప్రభుత్వ పెద్దలకు ముందే తెలుసు: ఒప్పందం నుంచి అజూర్ సంస్థ వైదొలగుతుందని తెలిసి రాష్ట్ర ప్రభుత్వం 2023 ఆగస్టు 30వ తేదీన సెకికి లేఖ రాసింది. అజూర్ వైదొలగితే తమకు విద్యుత్ ఎవరిస్తారని ప్రశ్నించింది. అసలు వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నట్లు విద్యుత్ సరఫరా బాధ్యత అంతా సెకిదే అయినప్పుడు, ఆ ఒప్పందం నుంచి అజూర్ వైదొలగుతుందని తెలిసి, సెకికి గత ప్రభుత్వం ముందుగానే ఎందుకు లేఖ రాసింది? అజూర్ సంస్థ వైదొలిగితే, ఆ సమయంలో ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిన బాధ్యత సెకిదే కదా? ఒప్పందం ప్రకారం సెకి విద్యుత్ సరఫరా చేయలేకపోతే అప్పుడు కదా ప్రభుత్వం స్పందించాలి. అలా కాకుండా ముందే ఎందుకు స్పందించింది? అంటే పేరుకు సెకితోనే ఒప్పందం చేసుకున్నా, తెర వెనుక ఉన్నది అదానీ, అజూర్ సంస్థలేనని నాటి ప్రభుత్వ పెద్దలకు ముందే తెలుసన్నది సుస్పష్టమవుతోంది.
నిరుద్యోగులకు శుభవార్త - పెండింగ్ నోటిఫికేషన్స్ కోసం ఏపీపీఎస్సీ చర్యలు
ఏపీ ప్రభుత్వం సాంకేతికంగా సెకితో విద్యుత్ కొనుగోలు అగ్రిమెంట్ చేసుకున్నట్టు కనిపిస్తున్నా, అది అదానీ, అజూర్ సంస్థలతో వయా సెకి చేసుకున్న ఒప్పందం కిందే లెక్క. రాజస్థాన్‌లో ఏర్పాటుచేసిన ప్రాజెక్టుల నుంచి అదానీ 4 వేల 667 మెగావాట్లు, అజూర్ సంస్థ 2 వేల 333 మెగావాట్ల చొప్పున తమకు సరఫరా చేసేలా ఆ రెండు సంస్థలతో సెకి ఒప్పందం చేసుకుంది. కానీ ఆ తర్వాత అజూర్ సంస్థ తాము విద్యుత్‌ని సరఫరా చేయలేమంటూ సెకికి చెప్పేసింది. ఆ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, అజూర్ వైదొలిగితే, 2,333 మెగావాట్లు ఎవరిస్తారని ప్రశ్నించింది. అంటే విద్యుత్ సరఫరా చేస్తోంది అదానీ, అజూర్ సంస్థలని తెలిసే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ లేఖ రాసినట్టు కదా? మరి ఆ సంస్థల విషయం తమకేమీ తెలియదన్నట్టుగా వైఎస్సార్సీపీ నేతలు ఎవర్ని మభ్యపెడుతున్నారు?.
అదానీ సంస్థ లంచాల వ్యవహారం - జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
లంచాల వ్యవహారం మాట్లాడాకే ఒప్పందాలు: 2023 డిసెంబరులో సెకితో రాష్ట్రప్రభుత్వం కుదుర్చుకున్న అనుబంధ ఒప్పందంలో అజూర్ సంస్థ సరెండర్ చేస్తున్న 2 వేల 333 మెగావాట్లనూ అదానీ సంస్థే సరఫరా చేస్తుందని పేర్కొన్నారు. మొత్తం 7 వేలలో 534 మెగావాట్లు మినహా మిగతా విద్యుత్‌ని అదానీ సంస్థ ఏ ప్లాంటు నుంచి ఎంత సరఫరా చేసేదీ టేబుల్ రూపంలో ఇచ్చారు. యూనిట్ ధర 2 రూపాయల 47 పైసలకి అదానీ విద్యుత్ సరఫరా చేస్తుందని, సెకి ట్రేడింగ్ మార్జిన్ 7 పైసలు కలిపితే యూనిట్ విద్యుత్ ధర 2 రూపాయల 49 పైసలు అవుతుందని తెలిపారు. 7 వేల మెగావాట్లలో 534 మెగావాట్లకు అదానీ సంస్థకు సెకి అప్పటికి ఇంకా ఎల్‌ఓఏ (A Letter of Acceptance) జారీచేయాల్సి ఉన్నందున ఆ విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుందో ప్రస్తావించలేదు.
ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ - ఆ బస్సుల్లో ఛార్జీలు తగ్గింపు
2024 ఫిబ్రవరిలో రెండో అనుబంధ ఒప్పందంపై సెకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంతకాలు చేశాయి. దానిలో 534 మెగావాట్లు కూడా కలిపి మొత్తం 7 వేల మెగావాట్లు అదానీ సంస్థే సరఫరా చేస్తున్నట్టు స్పష్టంగా ఉంది. రెండో ఒప్పందంలోనూ టేబుల్ ద్వారా ఆ విద్యుత్‌ని అదానీ ఎక్కడెక్కడి నుంచి సరఫరా చేస్తుంది అనేది కూడా క్లియర్‌గా వివరించారు. సరఫరా ఎప్పటి నుంచి మొదలవుతుందన్న విషయాన్నీ ప్రస్తావించారు. పేరుకే తెరపైన సెకి కనిపిస్తున్నా, 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అదానీతోనేనని, అంతిమ లబ్ధిదారు ఆ సంస్థేనని ఈ అనుబంధ ఒప్పందాల్ని బట్టే అర్థమవుతోంది. మొత్తం కథ నడిపించింది అదానీయేనని, అమెరికా సంస్థలు ఆరోపిస్తున్నట్టు అదానీ గత ప్రభుత్వ పెద్దతో లంచాల వ్యవహారం మాట్లాడాకే ఒప్పందాలు జరిగాయని స్పష్టమవుతోంది.