ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'డబ్బు'ల్ ధమాకా! వాలంటీర్ల నగదు పురస్కారం రెట్టింపు - సీఎం జగన్‌ మాస్టర్ ప్లాన్

AP Volunteer Awards Cash Prize Increased: వాలంటీర్లతో పార్టీ పని చేయించుకునేందుకు వైసీపీ మరో మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేసింది. పురస్కారాల పేరుతో ఇస్తున్న తాయిలాల మొత్తాన్ని రెట్టింపు చేసింది. ఏకంగా రూ.250 కోట్ల నుంచి రూ.500 కోట్లకు పెంచేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రతిపాదనలకు కొద్ది రోజుల్లోనే ఆమోదం తెలియజేయనున్నట్లు సమాచారం.

AP_Volunteer_Awards_Cash_Prize_Increased
AP_Volunteer_Awards_Cash_Prize_Increased

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 10, 2024, 8:45 AM IST

'డబ్బు'ల్ ధమాకా! వాలంటీర్ల నగదు పురస్కారం రెట్టింపు - సీఎం జగన్‌ మాస్టర్ ప్లాన్

AP Volunteer Awards Cash Prize Increased: ఎన్నికల వేళ వాలంటీర్లను మచ్చిక చేసుకునేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త ఎత్తుగడ వేశారు. తన సొంత సైన్యంపై వల్లమాలిన ప్రేమని ఒలకబోస్తూ, వారికి ఇచ్చే నగదు పురస్కారాలను రెట్టింపు చేయబోతున్నారు. దీని కోసం ఏకంగా 250 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల్లో వాలంటీర్ల సేవలను మరింతగా వినియోగించుకునేందుకే వైసీపీ సర్కార్ నగదు పురస్కారాలను రెట్టింపు చేసిందని విపక్షాలు తప్పుబడుతున్నాయి.

ఎన్నికల ముందు వాలంటీర్లకు మరింతగా తాయిలాలు ఎరవేసి, వారితో పార్టీ పని చేయించుకునేందుకు జగన్‌ సర్కార్‌ మాస్టర్‌ ప్లాన్‌ వేసింది. ఏటా పురస్కారాల పేరుతో వారికి ఇస్తున్న తాయిలాల మొత్తాన్ని ఒక్కసారిగా రెట్టింపు చేయబోతోంది. వాలంటీర్లంతా వైసీపీ వారేనని ముఖ్యమంత్రి, ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో పురస్కారాల కింద ఏటా ఇస్తున్న మొత్తాన్ని 250 కోట్ల నుంచి 500 కోట్లకు పెంచేందుకు రంగం సిద్ధం చేయడం చర్చనీయాంశమవుతోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం కొద్ది రోజుల్లోనే ఆమోదం తెలియజేయనున్నట్లు తెలుస్తోంది. అవార్డుల ప్రదానోత్సవ సభల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవాలని, అధికారులకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలొచ్చినట్లు సమాచారం. సేవా వజ్ర అవార్డు కింద ఇచ్చే 30 వేల నగదు పురస్కారాన్ని 60 వేలకు, సేవారత్న పేరిట ఇచ్చే 20 వేలను 40 వేలకు, సేవామిత్ర అవార్డు కింద ఇస్తున్న 10 వేలను 20 వేలకు పెంచనున్నారు.

Village Volunteers Working as YSRCP Activists: ప్రజాధనంతో వేతనం తీసుకుంటూ వైసీపీ సేవలో గ్రామ వాలంటీర్లు

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేసే పేరుతో జగన్‌ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 50 వేలకు పైగా గ్రామ, వార్డు వాలంటీర్లను నియమించింది. ఒక్కో వాలంటీర్‌కు నెలకు 5 వేల రూపాయల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తోంది. వాలంటీర్లు ఎవరో కాదు వైసీపీని అభిమానించే తమలో నుంచి వచ్చిన తమవారేనని సీఎం జగన్‌ ఇటీవల బాహాటంగానే ప్రకటించారు. వాలంటీర్లు వైసీపీ కోసం పని చేస్తున్న కార్యకర్తలని మంత్రి అంబటి రాంబాబు స్వయంగా చెప్పారు. వీరికి ఇస్తున్న గౌరవ వేతనానికి అదనంగా ప్రభుత్వం ఏటా అవార్డులను ఇస్తోంది. నియోజకవర్గానికి అయిదుగురు చొప్పున 875 మందిని సేవా వజ్ర అవార్డుకు ప్రభుత్వం ఎంపిక చేస్తోంది.

ప్రతి మండలం, మున్సిపాలిటీ నుంచి అయిదుగురు చొప్పున, నగరపాలక సంస్థ నుంచి పది మంది చొప్పున మొత్తంగా 4 వేల 220 మందికి సేవా రత్న అవార్డు, మిగిలిన వారికి సేవా మిత్ర అవార్డులను ఇస్తోంది. వీరికి నగదు పురస్కారంతోపాటు మెడల్, బ్యాడ్జి, శాలువా, సర్టిఫికెట్‌ ఇస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల ముంగిట వాలంటీర్లను మరింత మెప్పించి, పార్టీకి అనుకూలంగా పనిచేయించుకోవడానికి వారిపై వైసీపీ ప్రభుత్వం వల్లమాలిన ప్రేమ ఒలకబోస్తూ నగదు పురస్కారం రెట్టింపు చేస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి.

Volunteer Gambled with Pension Money: పెన్షన్ డబ్బును జూదంలో పోగొట్టి.. ఆపై కట్టుకథ అల్లి.. అడ్డంగా బుక్కైన వాలంటీర్

ABOUT THE AUTHOR

...view details