NATIONAL INTEGRATION CAMP 2024 :విద్యార్థులు కేవలం తరగతి గదుల్లో చెప్పే పాఠాలకు మాత్రమే పరిమితమైతే కెరీర్‌కు పెద్దగా ప్రయోజనం ఉండదు. కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. ప్రపంచంలో ఏం జరగుతుందో తెలుసుకోవాలి. మన దేశ సంప్రదాయాలు, భిన్న సంస్కృతులపై కూడా అవగాహన అవసరం. అందుకే వివిధ రాష్ట్రాల విద్యార్థులను ఒక్కచోట చేర్చి నేషనల్ ఇంటిగ్రేటెడ్ క్యాంప్‌ల ద్వారా ప్రయత్నం జరుగుతోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సత్తాచాటారు మన తెలుగు విద్యార్థులు.
వివిధ అంశాలపై అవగాహన : ఏటా ఒక్కో ప్రాంతంలో నిర్వహించే నేషనల్ ఇంటిగ్రేటెడ్ క్యాంప్ ఈ సారి కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. నేషనల్ సర్వీస్ స్కీం ఆధ్వర్యంలో విద్యార్థులు వారం రోజులపాటు వివిధ అంశాలపై అవగాహన పెంచుకుని ప్రతిభ, నైపుణ్యాలు మెరుగుపరుచుకున్నారు. మెంటర్స్ ప్రోత్సాహంతో కొత్త విషయాలు నేర్చుకున్నారు.
వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు :నేషనల్ ఇంటిగ్రేటెడ్ క్యాంప్‌లో కర్ణాటకలోని 5 విశ్వవిద్యాలయాలు సహా కేరళ, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన బృందాలు పాల్గొన్నాయి. ఏపీ తరఫున రాయలసీమ విశ్వవిద్యాలయం విద్యార్థులకు అవకాశం లభించింది. ఒక్కో రాష్ట్రం నుంచి పది మంది చొప్పున విద్యార్థులు సహా ప్రోగ్రాం ఆఫీసర్స్ పాల్గొన్నారు. మొత్తం 108 మంది ఈ క్యాంపులో పాల్గొన్నారు.
ఈ క్యాంప్‌కి వచ్చిన విద్యార్థులను 5 గ్రూపులుగా విభజించారు నిర్వాహకులు. వాటిలో 4 గ్రూపులకు మన విద్యార్థులే నాయకత్వం వహించారు. ప్రోగ్రాం ఆఫీసర్ శివప్రసాద్ రెడ్డి మరో గ్రూపును లీడ్ చేశారు. మన విద్యార్థులు కూచిపూడి, జానపదాలు, కర్రసాము, తెలుగు పాటలతో చక్కగా అలరించారు. మన ఆహార అలవాట్లైన రాగిసంగటి, జొన్నరొట్టె, నాటుకోడి పులుసు, పూతరేకులు, కుండబిర్యాని, ఆవకాయ గురించి తెలియజేశారు.