AP Police Weekly Off System: అధికారమే పరమావధిగా ఎడాపెడా హామీలు గుప్పించిన జగన్, వాటిని నెరవేరుస్తానంటూ గత ఎన్నికల ముందు మేనిఫెస్టో తెచ్చారు. అధికారంలోకి వచ్చాక మాత్రం అన్ని వర్గాల వారికీ నమ్మక ద్రోహం చేశారు. జగన్‌ను నమ్మి మోసపోయిన వారిలో పోలీసులూ ఉన్నారు. వారాంతపు సెలవుపై పాదయాత్ర సమయంలో జగన్ చెప్పిన మాటను వారంతా విశ్వసించారు. అయితే వారి నమ్మకాన్ని నిలబెట్టుకున్నట్లు నటించిన వైసీపీ ప్రభుత్వం, వారానికి ఒక రోజు సెలవు కల్పించేలా 2019 జూన్ 19 నుంచి ‘‘వీక్లీ ఆఫ్’’ను అమల్లోకి తెచ్చింది. తమకిచ్చిన హామీ నెరవేర్చారంటూ పోలీసులు జగన్‌కు సన్మానాలు, సత్కారాలు చేశారు. అప్పటికి జగన్మోసాన్ని తెలుసుకోలేకపోయారు.
పోలీసులకు వారాంతపు సెలవుపై 2019 అక్టోబర్ 21 సీఎం జగన్ గొప్పలు చెప్పారు. దేశంలోనే తొలిసారి తామే అమలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మొదట్లో నాలుగైదు నెలల ఈ విధానం సక్రమంగానే అమలైంది. 2020 మార్చిలో కొవిడ్ పరిస్థితులు, లాక్‌డౌన్ కారణంగా ‘‘వీక్లీ ఆఫ్’’ల విధానం మూడునాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.
99 శాతం హామీలు ఎలా పూర్తయ్యాయి జగన్? - ఈ ప్రశ్నలకు సమాధానం ఏంటి? - YSRCP Fake Manifesto
అనంతరం 2020 అక్టోబర్ 21న సీఎం జగన్ మాట ఉద్యోగాల భర్తీపైకి వెళ్లింది. పోలీసు ఉద్యోగాలు భర్తీ చేసిన తర్వాత వీక్లీ ఆఫ్ విధానాన్ని అమలు చేస్తామంటూ జగన్ చెప్పుకొచ్చారు. ఎందుకంటే పోలీసులకు వారంతపు సెలవు విధానం అమలుకావాలంటే ఖాళీగా ఉన్న 12 వేల 384 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుందని, రవిశంకర్ అయ్యన్నార్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. కానీ జగన్ పాలనలో 411 ఎస్సై ఉద్యోగాలు మినహా ఒక్క పోలీసు కానిస్టేబుల్ పోస్టూ భర్తీ కాలేదు.