తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్జీవీ ఎక్కడ ? - ఆంధ్రప్రదేశ్ పోలీసుల 'వ్యూహం' బెడిసికొట్టాందా? - AP POLICE SEARCHING FOR VARMA

డైరెక్టర్​ రామ్​ గోపాల్​ వర్మ కోసం ఏపీ పోలీసుల పేట - అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆర్జీవీ - సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబు, పవన్​, లోకేశ్​పై వ్యక్తిగత దూషణలు చేసిన ఆర్జీవీ

Director Ram Gopal Varma Issue
Director Ram Gopal Varma Issue (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 26, 2024, 1:36 PM IST

Director Ram Gopal Varma Issue :వివాదాస్పద సినిమాల చిత్రీకరణకు కేరాఫ్​ అడ్రస్​ డైరెక్టర్​ రామ్​గోపాల్​ వర్మ(ఆర్జీవీ). అలాగే తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పటికప్పుడు అందరి నోటా నిలుస్తారు.. నాకు చట్టాలు అంటే లెక్క లేదు అన్నట్లు ఉంటుంది ఆయన ప్రదర్శించే తీరు. 'నా ఇష్టం వచ్చినట్లు సినిమాలు తీస్తా.. చూస్తే చూడండి.. లేకపోతే లేదంటూ బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తారు.' ప్రస్తుతం పోలీసులకు చిక్కకుండా తప్పించుకునేందుకు అడ్డదారులు వెతుక్కుంటున్నారు. అయితే ఇప్పటికి అర్థమై ఉంటుంది ఆయనకు చట్టంతో చెలగాటం కుదరదని. అచ్చం నేతల పోలికలతో ఉన్న నటీనటులతో ఓ పార్టీకి అనుకూలంగా సినిమాలు తీస్తారు.. వాటి ప్రమోషన్​ కోసం అప్పటి విపక్ష నేతలైన చంద్రబాబు, పవన్​ కల్యాణ్​, లోకేశ్​లపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారు. ఇప్పుడు అవే దూషణలు, మార్ఫింగ్​ ఫొటోలతో ఆయన పెద్ద చిక్కుల్లోనే పడ్డారు.

అజ్ఞాతంలోకి ఆర్జీవీ : 1997లో ఆర్జీవీ ఓ సినిమా తీశారు.. అదే దౌడ్​(పరుగు). ప్రస్తుతం పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు ఆయన కూడా తన సినిమానే ఫాలో అవుతున్నారు. గత ప్రభుత్వంలో ఎప్పుడు బహిరంగంగానే సామాజిక మాధ్యమాలు, టీవీ షోలలో విమర్శించిన ఆర్జీవీ.. ఇప్పుడు అకస్మాత్తుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కనీసం పోలీసుల కేసును ఎదుర్కోవడానికి కూడా ధైర్యం చేయలేకపోతున్నారు. ఎదురుగా ఢీకొట్టే ధైర్యం కూడా చేయలేకపోతున్నారు ఆర్జీవీ అంటూ సామాజిక మాధ్యమాల్లో ఆయనపై తెగ కామెంట్లు వస్తున్నాయి.

విచారణకు పిలిచిన పోలీసులు.. సాకులు వెతుకున్న వర్మ :అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నెల రోజుల క్రితమే ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్​లో వర్మపై ఓ కేసు నమోదైంది. ఇందుకు ఆయనకు విచారణకు రావాలంటూ ఒంగోలు పోలీసులు హైదరాబాద్​లోని ఆయన కార్యాలయానికి వెళ్లి నోటీసులు అందించారు. కానీ ఆయన ఈనెల 19న విచారణకు రాకుండా.. హైకోర్టులో క్వాష్​ పిటిషన్​ సైతం దాఖలు చేశారు.

అయితే ఆ పిటిషన్​ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో వారం రోజుల సమయం ఇవ్వాలని దర్యాప్తు అధికారికి వాట్సాప్​ ద్వారా ఆర్జీవీ మెసేజ్​ పంపించారు. తాను ఓ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నానని, అది గతంలో నిర్ణయించిన షెడ్యూల్​ అని వెళ్లకపోతే నిర్మాత భారీగా నష్టపోతారని అందులో తెలిపారు. దీనిపై పోలీసులు స్పందించలేదు. చివరికి న్యాయవాది ద్వారా లేఖ పంపి వ్యక్తిగత హాజరుకు సమయం కావాలని.. దర్యాప్తునకు సహకరిస్తానని పోలీసులకు లేఖ అందించారు. దీంతో పోలీసులు ఈనెల 25న విచారణకు హాజరుకావాలంటూ మరోసారి నోటీసులు వర్మకు పంపించారు.

వర్మ కోసం పోలీసులు గాలింపు :ఈనెల 19న ఒంగోలు గ్రామీణ సర్కిల్​ కార్యాలయంలో ఆర్జీవీ విచారణకు హాజరు కావాల్సింది. కానీ ఆయన గడువు కోరారు. తిరిగి ఈనెల 25న విచారణకు రావాలని విచారణ అధికారి మరో నోటీసు పంపిస్తే.. అప్పటికే హైకోర్టులో మరోసారి బెయిల్​ పిటిషన్​ను వర్మ దాఖలు చేశారు. సోమవారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆయన నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఉదయం 11గంటల సమయంలో పోలీసులు హైదరాబాద్​లోని ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడి వారితో మాట్లాడిన ఏం లాభం లేకుండా పోయింది. రామ్​గోపాల్​ వర్మ ఫోన్​ కూడా స్విచాఫ్​ వస్తుంది. దీంతో పోలీసులు ఆర్జీవీ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారని భావించి.. ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్​తో పాటు తమిళనాడులో సైతం పోలీసులు గాలిస్తున్నారు. ఈ మొత్తం స్టోరీని చూస్తే ఆర్జీవీ గతంలో తీసిన దౌడ్​ సినిమానే తపిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.

'నేను ఇప్పుడు విచారణకు రాలేను' : పోలీసులకు రామ్​గోపాల్ వర్మ వాట్సప్ మెసెజ్​

రామ్​గోపాల్​ వర్మపై వరుసగా కేసులు నమోదు - కొంపముంచిన సోషల్ మీడియాలో పోస్టులు

ABOUT THE AUTHOR

...view details