Ministers Meet on Mahashivratri Brahmotsavams:గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో కలిసి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరులో పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వరాలయానికి చేరుకొని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన వీఆర్వో, సీఆర్ఓ కార్యాలయాలను మంత్రులు ప్రారంభించారు. రానున్న మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ 13 రోజులపాటు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సుమారు 10 లక్షల మంది భక్తులు హాజరుకానున్నారని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని సులభతరంగా భక్తులందరికీ స్వామి, అమ్మవార్ల దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. బ్రహ్మోత్సవాలలో ఉచితంగా లడ్డూ ప్రసాదం పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవికి పూజలు నిర్వహించిన కుంకుమ, పసుపు, జాకెట్లతో కూడిన ప్రసాదాన్ని భక్తులకు వితరణగా పంపిణీ చేయనున్నట్లు మంత్రి వివరించారు.