Free Bus Scheme Study :ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మహిళలకు దీపం పథకం అమలుతో పాటు సామాజిక పింఛన్లు పెంచి ఫస్ట్ తారీఖున నేరుగా అందిస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుగా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలా? మిగతా పథకాలా? అన్న అంశంపై ముఖ్యమంత్రి మంత్రుల అభిప్రాయం కోరారు. ఇదిలా ఉండగా ఫ్రీ బస్ పథకంపై క్యాబినెట్ సబ్ కమిటీ కర్ణాటక రాష్ట్రంలో శుక్రవారం పర్యటించింది. అక్కడి మంత్రులు, అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంది.
మహిళలకు ఉచిత బస్సు పథకం (Free bus scheme for women)పై అధ్యయనం కోసం మంత్రి వర్గ ఉప సంఘం కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి సహా ఆర్టీసీ అధికారులతో ఏపీ మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, అనిత, గుమ్మడి సంధ్యారాణి ఇతర అధికారులు బెంగళూరులో సమావేశమయ్యారు. కర్ణాటకలో అమలవుతున్న 'మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం'పై మంత్రుల కమిటీ అధ్యయనం చేస్తోంది. ఈ పథకం అమలుతో అక్కడి మహిళా ప్రయాణికులకు కలుగుతున్న సౌకర్యం, లబ్ధిపై కర్ణాటక బస్సుల్లో ప్రయాణం చేస్తూ వివరాలు అడిగి తెలుసుకుంది.
గుడ్‌న్యూస్ - ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం!
ఉచిత బస్సు పథకం ముందుగా కర్ణాటకలో ప్రారంభించడం తెలిసిందే. ఏపీలోనూ అమలు చేయనున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకోవడంపై హోం మంత్రి వంగలపూడి అనిత నేతృత్వంలోని ప్రతినిధి బృందం కర్ణాటకను సందర్శించింది. కర్ణాటక ప్రభుత్వ రవాణా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. '‘శక్తి పథకం' పేరిట అమలవుతున్న ఈ పథకం అమలు తీరుతెన్నులను తెలుసుకునేందుకు హోంమంత్రి అనిత, రవాణా శాఖ మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం అక్కడ పర్యటించింది. బస్సుల్లో ప్రయాణించిన మంత్రులు ప్రయాణికులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.