Underground Tunnel in Nallamala : రాష్ట్రంలో గోదావరి- బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా నల్లమల అడవుల్లో భూగర్భ టన్నెల్‌ను ప్రతిపాదిస్తున్నారు. బొల్లాపల్లి జలాశయంలో నీటిని నిల్వ చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్‌కు నీళ్లు తీసుకువెళ్లేందుకు వీలుగా నల్లమల అడవుల మీదుగా వాటిని మళ్లించాల్సి ఉంటుంది. ఇందుకు గాను అటవీ, పర్యావరణ అనుమతులు సులభంగా సాధించేందుకు వీలుగా అండర్ టన్నెల్ నిర్మాణం వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఈ మార్గంలో 24,000ల క్యూసెక్కుల నీటిని తీసుకువెళ్లేందుకు వీలుగా 118 కిలోమీటర్ల పొడవున గ్రావిటీ కాలువ తవ్వుతారు. ఇందులో భాగంగా మూడుచోట్ల నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. దీంతోపాటు టన్నెల్ నిర్మాణమూ అవసరమవుతుంది. నల్లమల అటవీ ప్రాంతంలో దాదాపు 27 కిలోమీటర్ల పొడవున టన్నెల్ తవ్వుతారు. ఇది వన్యప్రాణి అటవీ సంరక్షణ ప్రాంతం కావడంతో ఈ టన్నెల్‌ను భూగర్భంలో తవ్వాలని అధికారులు ప్రతిపాదిస్తున్నారు. ఈ టన్నెల్ ప్రారంభం, ఆ తర్వాత వెలుపలికి నీళ్లు వచ్చే ప్రాంతం కూడా అటవీ ప్రాంతంలో లేకుండా ప్రణాళికలు సిద్ధం చేశారు. అటవీ ప్రాంతం అంతా భూగర్భంలోనే నీళ్లు ప్రవహిస్తాయి. ఈ టన్నెల్ కోసం 17,000ల ఎకరాల అటవీ భూమి అవసరమని లెక్కిస్తున్నారు. ఇందులో బొల్లాపల్లి జలాశయంలోనే 15,000ల ఎకరాలు కావాలి.
తొలి భాగంలో ఎత్తిపోతల అక్కర్లేదు : పోలవరం జలాశయం నుంచి కృష్ణా నది వరకు నీటిని తీసుకువెళ్లే మార్గంలో ఎక్కడా నీటిని ఎత్తిపోయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతమున్న కాలువల సామర్థ్యం పెంచుకుంటే సరిపోతుంది. పోలవరం కుడి కాలువ ఇప్పటికే 187 కిలోమీటర్ల మేర తవ్వి ఉంది. 17,800 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నిర్మించిన ఈ కాలువను 28,000ల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచేలా వెడల్పు చేస్తారు.
దీంతోపాటు ప్రస్తుతం గోదావరి వరద జలాలను ఉమ్మడి పశ్చిమగోదావరికి అందిస్తున్న తాడిపూడి ఎత్తిపోతల పథకం కాలువలు ఇందులో ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరిలో 80 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ ప్రధాన కాలువను మరో 108 కిలోమీటర్ల మేర పొడిగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం 1400 క్యూసెక్కులున్న కాలువ సామర్థ్యాన్ని 10,000ల క్యూసెక్కులకు పెంచేలా వెడల్పు చేస్తారు. ఆ కాలువలపై అవసరమైన కట్టడాలు నిర్మించాలి.
అనుమతులు ఎలా? : కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభుత్వాలే ఉన్న నేపథ్యంలో అనుమతులు లభించడం పెద్ద కష్టం కాకపోవచ్చనే అభిప్రాయం ఉంది. అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా భూములు చూపాల్సి ఉంటుంది. మరోవైపు కేంద్ర జలసంఘానికి డీపీఆర్ సమర్పిస్తారు. ఇతర రాష్ట్రాలతో సంబంధం లేకుండా దిగువన పోలవరం ప్రాజెక్టు నుంచి వరద జలాలే తీసుకుంటున్నందున అనుమతులు పెద్ద కష్టం కావని జలవనరులశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు దాదాపు 5,000 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. ఏటా ప్రాజెక్టు నిర్వహణకు కరెంట్ రూపంలోనే రూ.వేల కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఇది అన్నింటి కన్నా పెద్ద సవాల్.
'పోలవరం పూర్తయ్యేది అప్పుడే - టార్గెట్ ప్రకటించిన సీఎం చంద్రబాబు