AP Ministers Lokesh And Nimmala Visit Budameru : ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నందివాడ మండలంలో బుడమేరుకు మళ్లీ క్రమంగా వరద పెరుగుతోంది. మంగళవారం సుమారు వెయ్యి క్యూసెక్కుల ప్రవాహం కొనసాగగా బుధవారం ఎగువ ప్రాంతం నుంచి 8 వేల క్యూసెక్కుల వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో అడుగు పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. గండి పడిన చోట ప్రస్తుతం బుడమేరు ప్రవాహం 3 అడుగులకు చేరింది. ఇప్పటికే మొదటి గండిని పూడ్చారు. మరో 2 గండ్లు పూడ్చేలా పనులు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో వరద ప్రవాహం పెరుగుతుండడంతో పనులకు ఆటకం కలుగుతోంది. ఏపీ మంత్రులు నారా లోకేశ్, నిమ్మల రామానాయుడు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. గండ్లు పడిన ప్రాంతానికి వెళ్లే మార్గం లేకపోవడంతో బురదలో వారు కాలినడకన అక్కడికి చేరుకున్నారు. గత ఐదు సంవత్సరాలలో కనీస మరమ్మతుల పనులు కూడా చేయకపోవడమే గండ్లు పడటానికి ప్రధాన కారణమని అధికారులు ఏపీ మంత్రులకు వివరించారు. 200 మీటర్ల వెడల్పున మూడు గండ్లు ఏర్పడ్డాయని అధికారులు లోకేశ్‌కు వివరించారు. వేగవంతంగా గండ్లు పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.