తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థుల దాడితో ఉపాధ్యాయుడి మృతి - హెచ్​ఎంతో పాటు ఆ టీచర్​పై చర్యలు - TEACHER DEATH CASE IN AP

ఏపీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఉపాధ్యాయుడి కేసులో అధికారులపై చర్యలు- ఘటనకు బాధ్యులను చేస్తూ హెడ్​ మాస్టర్​తో పాటు మరో టీచర్ సస్పెన్షన్​ - బాధిత కుటుంబానికి అండగా ఉంటామని లోకేశ్ భరోసా

AP MINISTER LOKESH ON TEACHER CASE
AP Govt Takes Action for Teacher Death Case (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 7, 2024, 7:49 AM IST

AP Govt Takes Action for Teacher Death Case :ఆంధ్రప్రదేశ్​లోని అన్నమయ్య జిల్లాలో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సైన్స్ టీచర్ ఎజాస్​ అహ్మద్​ కేసులో అధికారులు చర్యలు చేపట్టారు. ఘటనకు బాధ్యులుగా హెచ్​ఎంతో పాటు మరో ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. కొత్తపల్లి ఉర్దూ జడ్పీ హైస్కూల్​లో గత రెండ్రోజులుగా విచారించిన అధికారులు, విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో పాటు ఘటనకు సంబంధించి నిజాలను బయటకు రాకుండా దాచిపెట్టారనే అభియోగంపై ప్రధానోపాధ్యాయుడు షబ్బీర్​, క్లాస్​ రూమ్​కు వెళ్లకుండా స్టూడెంట్స్​ మధ్య గొడవకు కారణమైన మరో టీచర్​ వెంకట్రామిరెడ్డిలను బాధ్యులుగా చేస్తూ విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఇద్దరినీ సస్పెండ్ చేశారు. ఈ మేరకు డీఈవో సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన డీఈవో, పాఠశాలల్లో జరిగే ఎలాంటి విషయాలపైన అయినా యాజమాన్యం పూర్తి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఏపీ మంత్రి లోకేశ్ పరామర్శ :మరోవైపు మృతి చెందిన ఎజాస్​ అహ్మద్ భార్య రెహమూన్​ను ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్​ పరామర్శించారు. ఆమెతో ఫోన్​లో మాట్లాడిన ఏపీ మంత్రి, ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా తన భర్త మృతిపై సమగ్ర విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని రెహమూన్‌ లోకేశ్​ను కోరారు. ఈ క్రమంలోనే పాఠశాలలోని కొందరు టీచర్స్​ విద్యార్థులను ప్రేరేపించడంతోనే స్టూడెంట్స్ తన భర్తపై దాడికి దిగారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఎజాస్​ అహ్మద్​ మృతిపై అన్ని కోణాల్లో విచారించి బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని లోకేశ్ ఆమెకు హామీ ఇచ్చారు.

అసలు ఏం జరిగిందంటే ? : బుధవారం (ఈ నెల 4) సాయంత్రం స్కూల్​ ముగిసే సమయంలో ఎజాస్​ అహ్మద్​ పిల్లలకు క్లాస్​ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే పక్కన ఉన్న 9వ తరగతి గదిలో టీచర్లు ఎవరూ లేకపోవడంతో విద్యార్థులు అల్లరి చేస్తున్నారు. దీంతో వారిని మందలించేందుకు ఎజాస్​ అహ్మద్​ ఆ క్లాస్​రూమ్​లోకి వెళ్లారు. ముగ్గురు విద్యార్థులు గొడవ పడటం చూసి వారిని మందలించాడు. వారిలో కవల పిల్లలైన ఒకరిపై చేయి చేసుకోగా, అతని సోదరుడు, మరో విద్యార్థి కలిసి ఉపాధ్యాయుడిపైకి ఎదురు తిరిగారు. ముగ్గురూ కలిసి తోసేయడంతో కిందపడిపోయారు.

గొడవ విషయం తెలుసుకున్న ఇతర టీచర్లు ఎజాస్​ అహ్మద్​ను అక్కడి నుంచి స్టాఫ్​రూమ్​లోనికి తీసుకెళ్లారు. విద్యార్థులు తనపై దాడి చేయడాన్ని అవమానంగా భావించిన ఆయన, అరగంట పాటు తనలో తానే కుంగిపోయారు. ఈ క్రమంలోనే కూర్చున్న కుర్చీలోనే కుప్పకూలిపోయారు. హాస్పిటల్​కు తరలించగా, గుండెపోటుతో అప్పటికే మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. ఉపాధ్యాయుడిపై దాడికి పాల్పడిన ముగ్గురు విద్యార్థులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.

ఉపాధ్యాయుడిపై విద్యార్థుల దాడి! - కూర్చున్న కుర్చీలోనే ప్రాణాలొదిలిన టీచర్

ABOUT THE AUTHOR

...view details