AP Liquor Shop Tenders 2024 :ఆంధ్రప్రదేశ్లో మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ ముగిసింది. శుక్రవారం దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగియగా ఇవాళ లాటరీ పద్ధతిలో విజేతలను ప్రకటించారు. ఈసారి విజేతల్లో మహిళల సంఖ్య కూడా భారీగానే ఉండడం విశేషం. లైసెన్స్ ఫీజులో ఆరో వంతు డబ్బును 48 గంటల్లోగా చెల్లించి వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం లాటరీ తీసిన కేంద్రంలోనే కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు.
శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని 87 మద్యం షాపులకు లాటరీ తీయగా అందులో 60 దుకాణాలు మహిళలే గెలుచుకోవడం విశేషం. జిల్లాలో మొత్తం 1074 అప్లికేషన్లు రాగా 87 మందిని లాటరీ ద్వారా ఎంపిక చేశారు. బాపట్ల జిల్లాలో 117 షాపులకు 2149 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 6 షాపులను మహిళలు దక్కించుకున్నారు. వైఎస్సార్ జిల్లాలో 139 దుకాణాలు కేటాయించగా ఓ న్యూస్ ఛానల్ ప్రతినిధులు కమలాపురం నియోజకవర్గంలోని 4 దుకాణాలను లాటరీలో దక్కించుకున్నారు. వారితో సిండికేట్ కోసం స్థానిక నేతలు అప్పుడే వారితో మంతనాలు ప్రారంభించినట్లు సమాచారం.
లక్ కొద్దీ దక్కినా లైసెన్స్ రద్దు : అల్లూరి జిల్లాలో ఓ వ్యక్తి మద్యం దుకాణాల కోసం పెద్ద యజ్ఞమే చేశాడు. మొత్తం 60 అప్లికేషన్లు పెట్టుకున్నాడు. ఇందులో 3 షాపులు లాటరీలో వచ్చాయి. లాటరీ ద్వారా లిక్కర్ షాప్ గెలుచుకున్న వారిలో ఓ వికలాంగుడు కూడా ఉన్నాడు. పెదబయలులో అతనికి దుకాణం దక్కింది. మరోవైపు జిల్లాలోనే లాటరీ దక్కిన వ్యక్తి లైసెన్స్ రద్దు చేశారు. ఏం జరిగిందంటే లాటరీ వచ్చిన వ్యక్తి గిరిజనేతరుడని తేలింది. దీంతో అతని లైసెన్స్ రద్దు చేసి రెండోస్థానంలో వచ్చిన వ్యక్తికి కేటాయించారు.