AP Hotel Owners Talks with Swiggy Representatives: రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 14 నుంచి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీని బహిష్కరించాలని హోటల్ అసోయేషన్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసుకుంది. స్విగ్గి ప్రతినిధులతో విజయవాడలో హోటల్ యాజమాన్యాలు చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడంతో తమ బాయ్‌కాట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఆరంభంలో జీరో కమిషన్ పేరిట యాప్ ప్రారంభించిన స్విగ్గీ ఇప్పుడు 30శాతం కమిషన్ వసూలు చేస్తోందని హోటల్ యాజమాన్యాలు ఆరోపించాయి.
ఆర్డర్లపై ప్లాట్ 125 రూపాయల నుంచి 175 రూపాయల వరకు తగ్గింపు వంటి వాటి వల్ల డెలివరీ యాప్‌ల తమ వ్యాపారానికి హాని కలిగిస్తున్నాయనేది హోటల్ నిర్వాహకుల ఆవేదన. రెస్టారెంట్ యాజమాన్యానికి తెలియకుండా వారి అనుమతి లేకుండా స్విగ్గీ రెస్టారెంట్ మెనూలో మార్పులు చేస్తూ తరచు తక్కువ ధరకు ఆహార ఉత్పత్తులను విక్రయిస్తోందని ఇది పూర్తిగా చట్టవిరుద్ధమైన పద్ధతిగా పేర్కొన్నారు.
రెస్టారెంట్ యజమానులకు ఆర్ధిక భారం:తమకు తెలియకుండానే ఆన్‌లైన్‌లో ఇష్టానుసారం డిస్కౌంట్లు ప్రకటిస్తోందని వాటిని బలవంతంగా తమపై రుద్దుతోందన్నారు. కొనుగోలుదారులు ఆర్డర్ రద్దు చేసినా ఆ నష్టాన్ని సైతం హోటళ్లపైనే వేస్తున్నారని ఇది సరైన విధానం కాదని వారు తెలిపారు. ఎక్కువ ఆర్డర్ల పేరిట రెస్టారెంటు యజమానుల నుంచి ప్రచార రుసుములు వసూలు చేస్తున్నాయని ఒక పట్టణంలో 100 రెస్టారెంట్ల వరకు ఉంటే వాటిలో చాలా వరకు ఒకే ప్రచార రుసుం వసూలు వల్ల అనైతిక, అనారోగ్య పోటీ వాతావరణం కలుగజేస్తున్నాయని వివరించారు. ప్రమోషన్ ఛార్జీలు మెనూ ధరలలో 15 శాతం వరకు చేరుస్తున్నాయని ఇది రెస్టారెంట్ యజమానులకు గణనీయమైన ఆర్ధిక భారానికి దారి తీస్తున్నాయని ఆరోపించారు.