AP High Court to Penalty Three Officers :కోర్టు ఆదేశాల అమలును కిందిస్థాయి అధికారులపై తోసివేసి చేతులు దులుపుకుంటున్న ఉన్నతాధికారుల తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను అమలు పరచండి అంటూ దిగువ స్థాయి సిబ్బందిని ఆదేశిస్తూ ఓ లేఖ/ ప్రొసీడింగ్స్ జారీచేస్తే సరిపోదంది. అలాంటి ప్రొసీడింగ్స్ జారీ చేసినంత మాత్రాన కోర్టు ఉత్తర్వులను అమలు చేసినట్లు కాదంది. కోర్టు ఉత్తర్వులను అందుకున్నాక వాటిని సరైన స్ఫూర్తితో అమలు చేయాల్సిన చట్టబద్ధ బాధ్యత అధికారులపై ఉమ్మడిగా, వ్యక్తిగతంగా ఉంటుందని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలకు కొత్త భాష్యం చెప్పకుండా వాటిని యథాతథంగా అమలు చేయడమే అధికారుల విధి అని తేల్చి చెప్పింది.
కోర్టును మోసం చేయాలనుకుంటే మూల్యం చెల్లించాల్సిందే - ఎస్సై అభ్యర్థులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
ప్రసుత్త కేసులో ఉన్నతాధికారులు కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యతను జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి(డీఎంహెచ్‌ఓ)పై తోసివేశారని ఆక్షేపించింది. ఇలాంటి చర్యలు కోర్టుధిక్కరణ కిందకు వస్తుందని పేర్కొంది. వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ప్రజాఆరోగ్యశాఖ నాటి సంచాలకుడు వి.రామిరెడ్డి, కాకినాడ జిల్లా అప్పటి కలెక్టర్ కృతికాశుక్లాకు రూ 2వేల చొప్పున జరిమానా విధించింది. మరోవైపు కోర్టు ఉత్తర్వులపై అవిధేయత చూపి, ధిక్కరణకు పాల్పడినందుకు కాకినాడ పూర్వ డీఎంహెచ్‌ఓ ఎన్ శాంతిప్రభకు 6 నెలల సాధారణ జైలు శిక్ష, రూ 2వేల జరిమానా విధించింది. అప్పీల్ దాఖలుకు సమయం ఇవ్వాలని ధిక్కరణదారులు అభ్యర్థించడంతో తీర్పు అమలును ఆరు వారాలు నిలుపుదల చేసింది.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల ఈమేరకు 73 కోర్టుధిక్కరణ వ్యాజ్యాలలో తీర్పు ఇచ్చారు. తూర్పు గోదావరికి చెందిన పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్స్(ఎంపీహెచ్‌ఏ-పురుష) నియామకం కోసం పిటిషనర్లను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశిస్తూ 2022లో తీర్పు చెప్పింది. ఆ తీర్పును అమలు చేయకపోవడంతో ఈ వెంకటేశ్వరరావు మరికొందరు 2023లో కోర్టుధిక్కరణ వ్యాజ్యాలు దాఖలు చేశారు. కోర్టుధిక్కరణ వ్యాజ్యాలపై విచారణ పెండింగ్‌లో ఉండగా అధికారులకు అనుకూలంగా ఉన్న కొంతమందిని ఎంపీహెచ్‌ఏలుగా నియమించి, తమను నిరాకరించారన్నారు. ధిక్కరణ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తి డీఎంహెచ్‌ఓ తీరుపై మండిపడ్డారు.
గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ నియామకం అవసరం లేదని డీఎంహెచ్‌ఓ సొంత నిర్ణయం తీసుకున్నారని ఆక్షేపించారు. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ఉలంఘించారన్నారు. ఇలాంటి అధికారుల వ్యవహార శైలి చట్టబద్ధ పాలనకు అవరోధం కలిగిస్తుందన్నారు. న్యాయపరిపాలనకు తీవ్ర నష్టం చేస్తుందన్నారు. డీఎంహెచ్‌ఓపై ఉదారత చూపాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు కృష్ణబాబు, రామిరెడ్డి, కృతికాశుక్లా కోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారని, న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని డీఎంహెచ్‌ఓకు సూచించిన నేపథ్యంలో వారిపై కొంత ఉదారత చూపుతూ జరిమానా మాత్రమే విధిస్తున్నట్లు పేర్కొన్నారు.
కోర్టు ధిక్కరణ - గుంటూరు మున్సిపల్ కమిషనర్‌కు జైలుశిక్ష!
కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదు - కోర్టు ధిక్కరణ కేసుల్లో ఏపీది రెండో స్థానం