TET, AP DSC 2024 Court Case Update:ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్), ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ-డీఎస్సీ)లను ప్రభుత్వం హడావుడిగా నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం గతంలో ఇచ్చిన షెడ్యూల్, ప్రస్తుత షెడ్యూల్లోని తేదీలను పరిశీలిస్తే ఈ వ్యవహారం అర్థమవుతోందని పేర్కొంది. పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
మెగా డీఎస్సీకి తిలోదకాలు - ఎన్నికల గుమ్మంలో మినీ డీఎస్సీతో 'జగన్నాటకాలు'!
పరీక్షకు సిద్ధమవడం సాధ్యపడదు:టెట్ నిర్వహణ కోసం రాష్ట్రప్రభుత్వం ఈనెల 8న ఇచ్చిన నోటిఫికేషన్, ఉపాధ్యాయుల భర్తీ కోసం ఈనెల 12న ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం. పెద్దిరాజు మరో నలుగురు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. వారి తరఫున సీనియర్ న్యాయవాది బి. ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. టెట్ల అర్హత సాధించిన వారు మాత్రమే టీఆర్టీలో పాల్గొనేందుకు అర్హులన్నారు. టెట్ ఫలితాలు మార్చి 14న ప్రకటిస్తారని, మరుసటి రోజే (15వ తేదీ) టీఆర్టీ పరీక్ష నిర్వహిస్తున్నారన్నారు. సిలబస్ ఎక్కువ ఉండటంతో టెట్ పరీక్షకు సిద్ధమవడం సాధ్యపడదన్నారు. కేవలం 19 రోజులు మాత్రమే సమయం ఇచ్చారన్నారు.
మరోవైపు టీఆర్టీ పరీక్షకు సిద్ధమయ్యేందుకు సమయం లేదన్నారు. హడావుడిగా పరీక్షలను ముగించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు సముచిత సమయం ఇవ్వాలని కోరారు. వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి, హడావుడిగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లుందని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు ప్రభుత్వ సహాయ న్యాయవాది సమయం కోరడంతో విచారణను ఈనెల 21కి వాయిదా వేశారు.
గందరగోళం ఎక్కువ-సమయం తక్కువ! ఏపీ సర్కార్ జారీ చేసిన టెట్ నోటిఫికేషన్‌పై అభ్యర్థుల్లో ఆందోళన!
డిఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారు: ఎస్జీటీ పోస్టులకు బీఈడి అభ్యర్ధులను అనుమతించటంపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఎస్జీటీ ఉద్యోగాలకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని, పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. బీఈడీ అభ్యర్థులను అనుమతించడం వల్ల లక్షల మంది డిఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని పిటిషనర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎన్సీటీఈ నిబంధనలుకు పూర్తిగా వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల ప్రక్రియ చేపట్టిందని జడ శ్రావణ్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
బ్రిడ్జి కోర్సుకి చట్టబద్ధత ఏముంది:ఎస్జీటీ అభ్యర్థులు తక్కువగా ఉన్న కారణంగా బీఈడి అభ్యర్థులను అనుమతించాల్సి వస్తుందని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. అర్హత సాధించిన బీఈడి అభ్యర్థులు రెండు సంవత్సరాల బ్రిడ్జి కోర్సు చేసిన తర్వాతే తరగతుల గదిలోకి అనుమతిస్తామన్నారు. సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా నోటిఫికేషన్ ఎలా ఇస్తారంటూ ఏజీని న్యాయస్థానం ప్రశ్నించింది. బ్రిడ్జి కోర్సుకి చట్టబద్ధత ఏముందని ఏజీని ప్రశ్నించింది. తక్షణమే నోటిఫికేషన్ నిలుపుదల చేస్తామంటూ ఉత్తర్వులిచ్చేందుకు ధర్మాసనం సిద్ధపడింది. ప్రభుత్వ వివరణ తీసుకోవడానికి ఒక్కరోజు సమయం కావాలని ఏజి కోర్టును అభ్యర్ధించారు. ఈనెల 23 నుంచి హాల్ టికెట్లు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుందని పిటిషనర్ న్యాయవాది, న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. హాల్ టికెట్లు జారీ చేయకుండా ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం తెలిపింది. అడ్వకేట్ జనరల్ అభ్యర్థన మేరకు తదుపరి విచారణను న్యాయస్థానం బుధవారానికి వాయిదా వేసింది.
డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల - 6100 పోస్టులు, 12 నుంచి దరఖాస్తులు