ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై పిటిషన్‌ - హైకోర్టు కీలక వ్యాఖ్యలు - HC on Visakha Steel Plant issue - HC ON VISAKHA STEEL PLANT ISSUE

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు సూటిగా పలు ప్రశ్నలు సంధించింది. ప్రైవేటీకరణపై కేంద్ర క్యాబినేట్‌ తీసుకున్న నిర్ణయంపై విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది.

AP High Court Hearing on Visakha Steel Plant Privatization Petition
AP High Court Hearing on Visakha Steel Plant Privatization Petition

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 4, 2024, 10:20 AM IST

AP High Court Hearing on Visakha Steel Plant Privatization Petition :విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు సూటిగా పలు ప్రశ్నలు సంధించింది. ఏ చట్ట నిబంధనలను అనుసరించి ప్రైవేటీకరణ చేస్తున్నారు? నిర్ణయం తీసుకోవడానికి ముందు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు చెందిన ఉద్యోగులు, భాగస్వాములు, రాష్ట్రప్రభుత్వాన్ని సంప్రదించారా? అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రైవేటీకరణ ఆలోచనను విరమించి, ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆలోచించాలంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన లేఖపై ఏమి నిర్ణయం తీసుకున్నారో చెప్పాలంది. ఆ లేఖపై స్పందించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని వ్యాఖ్యానించింది.

విశాఖ ఉక్కు నిర్వహణ విషయంలో అవసరమైన నిధులు విదేశాల నుంచి తెచ్చేందుకు, ఫెరా చట్టం కింద ప్రత్యేక బ్యాంక్‌ ఖాతా తెరిచేందుకు అనుమతించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ (KA Paul) ఇచ్చిన వినతిపై ఏమి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉక్కు పరిశ్రమకు చెందిన భూముల విక్రయం, తదితర అంశాలపై సమగ్ర వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని స్పష్టంచేసింది. మరోవైపు సొంత నిధులతో కొనుగోలు చేసిన 25 ఎకరాలను మాత్రమే విక్రయిస్తున్నామని, సేకరించిన భూములను విక్రయించడం లేదని విశాఖ ఉక్కు (రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌) కర్మాగారం తరఫు న్యాయవాది వివేక్‌ చంద్రశేఖర్‌ చెప్పిన విషయాన్ని ధర్మాసనం నమోదు చేసింది. తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఎన్‌ విజయ్‌తో కూడిన ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులిచ్చింది.

విశాఖ ఉక్కు భూములు విక్రయించారా? కొనుగోలు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా?: హైకోర్టు

KA Paul Petition on Visakha Steel Plant :విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిమిత్తం కేంద్ర క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ తదితరులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. కేఏ పాల్‌ నేరుగా వాదనలు వినిపించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే విదేశాల నుంచి రూ.8వేల కోట్లు తీసుకొస్తాన్నారు. ఆ విధంగా చేయనిపక్షంలో ఏ శిక్షకైనా సిద్ధం అన్నారు. గత 45 ఏళ్లలో విశాఖ ఉక్కు కర్మాగారం పన్నుల రూపంలో రూ.54 వేల కోట్లు చెల్లించిందన్నారు. విశాఖ ఉక్కుకు చెందిన భూములను విక్రయిస్తున్న నేపథ్యంలో యథాతథ స్థితి ఉత్తర్వులివ్వాలని కోరారు.

ఏ చట్ట నిబంధనల మేరకు విశాఖ స్టీల్​ ప్లాంట్​ను ప్రైవేటీకరణ చేస్తున్నారు: హైకోర్టు - Visakha Steel Plant

మరో పిటిషనర్‌ తరఫున న్యాయవాది బాలాజీ వడేరా వాదనలు వినిపించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించింది. విశాఖ ఉక్కు కర్మాగారం చరిత్ర తెలుసా అని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఎన్ని ఉక్కు కర్మాగారాల్లో పెట్టుబడులు ఉపసంహరణకు నిర్ణయం తీసుకున్నారో చెప్పాలంది. కేంద్ర ప్రభుత్వ న్యాయవాది సీవీఆర్‌ రుద్రప్రసాద్‌ వాదనలు వినిపించారు. భూముల విక్రయం విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిపాదన లేదన్నారు. పిటిషనర్‌ది ఆందోళన మాత్రమేనన్నారు. ఎలాంటి చర్యలు చేపట్టినా పారదర్శకంగా చేస్తామన్నారు. పత్రిక ప్రకటన ఇస్తామన్నారు. దీంతో విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. పూర్తి వివరాలతో అఫిడవిట్‌ వేయాలని ఆదేశించింది.

విశాఖ ఉక్కు ఊపిరి తీశారు - మెడలు వంచుతామని కేంద్రం ముందు సాగిలపడ్డ జగన్

ABOUT THE AUTHOR

...view details