AP Govt Start Online Sales App For Dwakra Women:పట్టణాల్లో స్వయం సహాయక మహిళల బృందాలు ఉత్పత్తి చేసిన వస్తువులకు మార్కెటింగ్ సదుపాయం మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తరహాలో ప్రత్యేక ఆన్లైన్ సేల్ యాప్ను తీసుకు వచ్చింది. ప్రజలు ఈ యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్న వస్తువులను డోర్ డెలివరీ చేసే విధానాన్ని అమల్లోకి తెస్తోంది. పొదుపు మహిళలను లక్షాధికారులు చేసేలా ప్రయత్నాలు చేస్తోంది. పొదుపు సంఘాల మహిళల కోసం మెప్మా అధికారులు ఆన్లైన్ సేల్ యాప్ను అందుబాటులోకి తెచ్చారు.
మార్కెట్లో పోటీ పడలేని పరిస్ధితులు: పట్టణాలు, నగరాల్లో కలిపి 28,56,000 మంది పొదుపు సంఘం మహిళలు మెప్మా సభ్యులుగా ఉన్నారు. స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి నెలనెలా బ్యాంకుల్లో నగదు జమ చేస్తూ పొదుపు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన ఈ మహిళలు ఉపాధి కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని పలు ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. చేనేత చీరలు, వస్త్రాలు, హస్తకళా వస్తువులు, పచ్చళ్లు, స్వీట్లు, తినుబండారాలు, మిల్లెట్స్ ఉత్పత్తులు, సౌందర్యం, అలంకరణ, గృహాలంకరణ వస్తువులు తదితర ఉత్పత్తులు చేస్తున్నారు.
పరిశ్రమల నుంచి తయారైన వస్తువుల కంటే నాణ్యంగా ఉన్నప్పటికీ మార్కెట్లో పోటీ పడలేని పరిస్ధితులు ఉన్నాయి. దీనివల్ల వీరి వస్తువులకు డిమాండ్ లేక ఆదాయం కోల్పోవాల్సివస్తోంది. దీంతో మహిళల కుటుంబాల ఆర్ధిక స్థితిపై ప్రతితకూల ప్రభావం చూపుతోంది. ఈ పరిస్ధితుల్లో మహిళలను ప్రోత్సహించడం, వారిని ఆర్ధికంగా స్థితిమంతులను చేయాలని తలచిన ప్రభుత్వం వీరికి తొలుత మార్కెటింగ్ సదుపాయం మెరుగు పరచాలని నిర్ణయించింది. దీని కోసం సరికొత్త ఆన్లైన్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
రెచ్చిపోతున్న వైఎస్సార్సీపీ సోషల్ మీడియా - సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు
మున్సిపల్ కార్యాలయాల్లో సిబ్బంది:ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) పేరిట ఆన్లైన్ ప్లాట్ ఫాంను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సులభంగా ఆన్లైన్ ద్వారా నచ్చిన వస్తువులను కొనుగోలు చేసేలా దీన్ని రూపొందించారు. గూగుల్ ప్లే స్టోర్లో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా ఉచితంగా వ్యాపార కార్యకలాపాలు చేయవచ్చు. తమ ఉత్పత్తులను ఈ యాప్ ద్వారా అమ్ముకునేలా అన్ని ఏర్పాట్లు చేశారు. యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక వ్యాపారం మొదలు పెట్టేముందు డ్వాక్రా మహిళలు అధికారుల వద్దకు వెళ్లి వారి వివరాలు సమర్పించి మై స్టోర్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మున్సిపల్ కార్యాలయాల్లో సిబ్బందిని ఏర్పాటు చేశారు.