AP Flood Damage Report 2024 : రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం ప్రకటించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది మృతి చెందిన్నట్లు ప్రభుత్వం తెలిపింది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 12 మంది మృతి చెందగా, గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడు జిల్లాలో ఒకరు మృతి చెందిన్నట్లు అధికారులు తెలిపారు. 1,69,370 ఎకరాల్లో వివిధ పంటలు, 18,424 ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం వాటిళ్లిన్నట్లు వెల్లడించారు. దీంతో 2లక్షల34 వేల మంది రైతులు నష్టపోయారని అధికారులు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 6,44,536 మంది నష్టం : అలాగే 60 వేల కోళ్లు, 222 పశువులు మృతి చెందిన్నట్లు ప్రకటించారు. వరదల వలన 22 సబ్ స్టేషన్లు దెబ్బతినగా, 3,312 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని తెలిపారు. 78 చెరువులకు, కాలువలకు గండ్లు ఏర్పడ్డాయని వెల్లడించారు. వర్షం, వరదల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 6,44,536 మంది నష్టపోయారని తెలిపారు.
193 రిలీప్ క్యాంపుల్లో 42,707 మంది ఆశ్రయం పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు 50 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీంలు రంగంలో దిగాయాని, ఆరు హెలికాఫ్టర్లు పనిచేస్తున్నట్లు వెల్లడించారు. 228 బోట్లను రెస్క్యూ ఆపరేషన్లో ఉన్నాయని తెలిపారు. 317 గజ ఈతగాళ్లను రంగంలో దింపినట్టు ప్రభుత్వం వివరించింది.
వరద బాధితులకు సహాయం చేయాలనుకుంటున్నారా?
వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. బాధితులకు ఏ రూపంలోనైనా సాయం అందించాలని సీఎం చంద్రబాబు కోరారు. స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వదలచిన దాతల కోసం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రత్యేక పాయింట్ ఏర్పాటు చేశారు.