Injection for Heart Attack Patients:ప్రస్తుతం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ గుండె సంబంధిత వ్యాధులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకప్పుడు కాస్త వయసు పైబడినవారిలో ఈ సమస్య తలెత్తేది. అయితే మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ సంభవిస్తోంది. అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినప్పుడు తొలిగంటలో ఓ అత్యవసర ఇంజక్షన్ ఇస్తే రోగి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. అయితే అది కాస్త ఖర్చుతో కూడిన వ్యవహారం.
ఇంజక్షన్ అందుబాటులో లేకపోవటం, ఆర్థిక సమస్యల కారణంగా సరైన సమయంలో వైద్యం అందక గుండెపోటుతో మరణించినవారి సంఖ్య అధికమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి గుండెనొప్పి రోగులకు సాంత్వన చేకూరేలా చర్యలు చేపట్టింది. హబ్ అండ్ స్పోక్ విధానంలో సేవల విస్తరణ ద్వారా ఖరీదైన ఇంజక్షన్‌ను అవసరమైన రోగులకు ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఏమిటీ విధానం? దీనివల్ల లాభాలేంటి? ఎప్పుడు ప్రారంభిస్తున్నారు? వంటి వివరాలు మీకోసం.
ఏమిటీ హబ్ అండ్ స్పోక్ విధానం:
- రాష్ట్రంలోని పూర్వ ప్రభుత్వ వైద్య కళాశాలలు అన్నింట్లో టెలిసెంటర్లను ఏర్పాటుచేశారు. వీటినే హబ్స్ అంటున్నారు. కొన్ని ఎంపిక చేసిన సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆసుపత్రులను వీటికి అనుసంధానం చేశారు. వాటినే స్పోక్స్ అంటారు.
- ఎవరికైనా గుండెనొప్పి వచ్చినప్పుడు దగ్గర్లో ఉన్న చిన్న ఆస్పత్రులైన స్పోక్స్‌కు వెళ్తే.. అక్కడి వైద్యులు వారికి ఈసీజీ తీస్తారు.
- రోగుల వివరాలు, వారి సమస్యను పెద్ద ఆస్పత్రికి (హబ్) పంపుతారు. వాటిని పరిశీలించే ఉన్నత వైద్యనిపుణులు.. ఆయా రోగులకు ఇంజక్షన్ అవసరమో కాదో చెబుతారు.
- దాన్ని బట్టి అవసరమైనవారికి వెంటనే చిన్న ఆస్పత్రి వైద్యులే టెనెక్ట్‌ప్లేస్ ఇంజక్షన్ ఇస్తారు.
- ఇప్పటివరకు 15,077 మంది రోగులను పరీక్షించగా.. వారిలో 6,508 మందికి గుండె సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.
- అందులో 840 మందికి ఇంజక్షన్ ఇచ్చి, ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేశారు.
- ఈ విధానంలో అత్యవసర చికిత్సతో రోగులు ప్రయోజనం పొందుతారని, మిగిలినవారికీ సరైన వైద్యం అందుతుందని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు.