AP Flood Victims Compensation Distribution : వరద బాధితుల్లో ఇప్పటి వరకు 98 శాతం మందికి పరిహారం జమ చేసినట్లు ఏపీ సర్కార్ పేర్కొంది. కేటాయించిన రూ.602 కోట్ల పరిహారంలో రూ.18 కోట్లు మాత్రమే మిగిలినట్లు తెలిపింది. సాంకేతిక కారణాలతో వరద సాయం అందని 2 శాతం మంది ప్రజల ఖాతాల్లో సోమవారం నగదు జమచేయనున్నట్లు వివరించింది. ఆధార్ అనుసంధానం సహా పలు కారణాలతో ఇప్పటికీ పరిహారం పొందని ఒక్కో కుటుంబానికి నగదు బదిలీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించినట్లు తెలియజేసింది. ఎన్టీఆర్ జిల్లాలో 15,000లు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 4,620 కుటుంబాలతో సహా ఇతర జిల్లాల్లో బాధిత ప్రజలకు జిల్లా అధికార యంత్రాంగం ద్వారా అకౌంట్లతో డబ్బులు జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
మరోవైపు వరద బాధితులందరికీ ప్రభుత్వసాయం చేరాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. వీలైనంత త్వరగా సాంకేతిక సమస్యలను పరిష్కరించి బాధితులను ఆదుకోవాలని పేర్కొన్నారు. ఆధార్ సీడింగ్ లేకపోవడం, బ్యాంకుల్లో కేవైసీ అప్‌డేట్ కాకపోవడం, సిబ్బంది తప్పుడు వివరాలు నమోదు చేయడం సహా వివిధ కారణాలతో చాలా మందికి ప్రభుత్వం అందించిన వరద సాయం నిలిచిపోయింది. ఇలాంటి వారందరి సమస్యలను తక్షణమే పరిష్కరించి వారి ఖాతాల్లో ఆర్థికసాయం జమ చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలిచ్చారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ఈ సాయం అందాలని ఏ ఒక్కరూ అసంతృప్తితో ఉండడానికి వీల్లేదని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
Money Deposit for AP flood Victims :మరోవైపు వరద ప్రాంతాల్లో ముఖ్యమైన పత్రాలు కోల్పోయిన వారికి నకళ్లను జారీ చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ పత్రాల నకళ్లను బాధితులకు ఉచితంగానే ఇవ్వాలని నిర్ణయించింది ఇందుకోసం ప్రభుత్వ శాఖలతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు. ఇందుకోసం జీవో జారీ చేసిన మరుసటి రోజు నుంచి వారం పాటు ప్రత్యేక క్యాంపులు నిర్వహించి వీటిని ఇవ్వనున్నారు.