Higher Education Department Actions to Changes in Degree Syllabus :వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ సిలబస్‌లో మార్పులు తెచ్చేందుకు ఉన్నత విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుత సిలబస్‌లో లోపాలను సరిచేయడంతోపాటు కొన్ని అదనంగా చేర్చనున్నారు. ఇతర రాష్ట్రాల్లోని విధానాలను అధికారులు ఇప్పటికే అధ్యయనం చేశారు. డిగ్రీలో మూడు విడతలు, 10 నెలలుగా ఉన్న ఇంటర్న్‌షిప్‌ను ఒక సెమిస్టర్‌కు కుదించాలని భావిస్తున్నారు.
ఎక్కువమంది ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించి ఇంటర్న్‌షిప్ (Internship) చేసినా వాటికి కంపెనీలు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. వీటి స్థానంలో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యూజీసీ తీసుకొచ్చిన స్వయం, స్వయం ప్లస్‌లోని సర్టిఫికెట్ కోర్సులు చేస్తే ప్రయోజనం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
క్రెడిట్లు వెయిటేజీల్లో మార్పులు : ప్రస్తుతం రాష్ట్రంలో డిగ్రీ ఇంటర్న్‌షిప్‌నకు 20 క్రెడిట్లు ఇస్తుండగా దిల్లీ, జామియా మిలియా, బిహార్‌లోని పాటలీపుత్ర యూనివర్సిటీల్లో 8 వరకు క్రెడిట్లు ఇస్తున్నారు. మేజర్ సబ్జెక్టు (Major subject)కు రాష్ట్రంలో 60 క్రెడిట్లు ఇస్తుండగా 66కు పెంచాలని భావిస్తున్నారు. ఈ పరిశీలనను అనుసరించి ఇంటర్న్‌షిప్‌నకు క్రెడిట్లు తగ్గించి వాటి స్థానంలో నైపుణ్యాల పెంపు విభాగంలో స్వయం, స్వయం ప్లస్ సర్టిఫికెట్ కోర్సులను తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారు. సర్టిఫికెట్ కోర్సుల (Course) ఎంపిక బాధ్యతను ఐఐటీ మద్రాస్‌కు అప్పగించారు. ఆ సంస్థ మార్కెట్‌లో డిమాండ్ (Demond) ఉన్నవాటిని ఎంపికచేసి జాబితా అందిస్తుంది.