Liquor Shops Allotted to Geetha Community : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని కల్లు, గీత కులవృత్తులకు 10 శాతం మద్యం దుకాణాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు ఆబ్కారీ శాఖ జిల్లాలవారీగా 335 మద్యం దుకాణాలు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో శెట్టిబలిజ, శ్రీశయన, ఈడిగ, గౌడ, యాత, గౌడ్, శెగిడి, గౌండ్ల, గామల్ల కులాల వారు ఉన్నారు. వీరితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉండే సొండి కులస్థులకు 4 దుకాణాలను కేటాయిస్తారు. అదేవిధంగా ఏ జిల్లాలో ఏ ఉప కులానికి ఎన్ని షాపులు కేటాయించాలో కూడా నిర్ణయించారు. అందులో ముఖ్యాంశాలు ఇవే. మరోవైపు త్వరలోనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
లైసెన్సు రుసుము సగమే :మరోవైపు గీత కార్మిక కులాలకు రిజర్వ్ చేసిన మద్యం దుకాణాలకు ఆర్‌ఈటీ రూపంలో వసూలు చేసే లైసెన్స్ రుసుము అన్ రిజర్వుడ్ దుకాణాల లైసెన్సు ఫీజులో సగం మాత్రమే ఉంటుంది. అన్ రిజర్వుడ్ కేటగిరీలో ఉన్న దుకాణాలకు ఆయా ప్రాంతాల జనాభాను బట్టి రూ.50 లక్షల నుంచి రూ.85 లక్షల వరకూ లైసెన్సు రుసుము వసూలు చేస్తున్నారు. కానీ గీత కార్మికుల కోసం కేటాయించిన దుకాణాలకు మాత్రం అందులో సగం రూ.25 లక్షల నుంచి రూ.42.50 లక్షలు మాత్రమే ఉండనుంది. వారికి కేటాయించిన దుకాణాలకు 2026 సెప్టెంబర్ 30వ తేదీ వరకూ లైసెన్సులు జారీ చేయనున్నారు.
మద్యం దుకాణాల కోసం దరఖాస్తు ప్రక్రియ విధానం :
- జిల్లా ప్రోహిబిషన్ - ఎక్సైజ్ అధికారి దుకాణాల దరఖాస్తుల కోసం నోటిఫికేషన్ జారీ చేస్తారు
- జిల్లా కలెక్టర్లు ఆధ్వర్యంలో లాటరీలు తీసి లైసెన్స్ ఎంపిక చేస్తారు
- ️అభ్యర్థులు తమ కుల, స్థానిక ధ్రువపత్రాలు సమర్పించాలి
- ️ఒక షాపు ఫీజు రూ.2 లక్షలు
- ️ఒక అభ్యర్థి ఆయా జిల్లాల పరిధిలో కేటాయించిన అన్ని దుకాణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు
- ️ఒక అభ్యర్థికి ఒక షాపు మాత్రమే కేటాయిస్తారు
- ఒకటి కంటే ఎక్కువ షాపులు వస్తే ఏదో ఒకటి మాత్రమే ఎంపిక చేసుకోవాలి
- ️ఈ దుకాణాల లైసెన్సు గడువు 30.09.2026 వరకు ఉంటుంది