ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యాశాఖలో సంస్కరణలకు సిద్ధమైన లోకేశ్ - రాబోయే ఆరు నెలల్లో అనేక మార్పులు - AP GOVT REFORMS IN SCHOOLS COLLEGES

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ప్రమాణాల మెరుగుకు విద్యాశాఖ కసరత్తు - రాబోయే ఆరు నెలల్లో అనేక మార్పులు తీసుకొచ్చేందుకు చర్యలు

AP_Govt_Reforms
AP Govt Reforms in Schools Colleges (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 26, 2024, 8:16 AM IST

AP Government Reforms in Schools and Colleges: ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ప్రమాణాలు మెరుగుపర్చేందుకు రాబోయే ఆరు నెలల్లో అనేక మార్పులు తీసుకొచ్చేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా మంత్రి లోకేష్‌ ఆధ్వర్యంలో అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పాఠశాలల వారీగా వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు ‘ఒక పాఠశాల-ఒక యాప్‌ ’ పేరుతో సమగ్ర డాష్‌బోర్డును సిద్ధం చేస్తున్నారు. విద్యా సంవత్సరం చివరి పని రోజున మరోమారు మెగా తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

పాఠశాలల వారీగా ప్రణాళికలు: రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభం రోజునే 1 నుంచి 12 తరగతుల విద్యార్థులకు డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను అందించేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలతో పాటు పోటీ పరీక్షల మెటీరియల్, ప్రాక్టీకల్‌ రికార్డులు అందచేయనున్నారు. బడులకు స్టార్‌ రేటింగ్‌ను మెరుగుపర్చేందుకు పాఠశాలల వారీగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు పాఠ్యాంశాల్లో సమూల మార్పులు తీసుకొస్తున్నారు.

'ఆంధ్రా మోడల్ ఎడ్యుకేషన్' లక్ష్యం - ఉపాధ్యాయులపై భారం తగ్గిస్తాం : లోకేశ్

సిలబస్​తో పాటు ప్రశ్నాపత్రాల విధానంలో మార్పులు: ఇంటర్మీడియట్‌ సిలబస్‌ను మార్పు చేయడంతోపాటు ప్రశ్నాపత్రాల విధానాన్ని మార్చనున్నారు. వెనుకబడిన విద్యార్థులతోపాటు పిల్లలకు అదనపు బోధన అందించేందుకు ఐఐటీ మద్రాస్‌తో కలిసి విద్యాశక్తి కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు. అకడమిక్‌ క్యాలెండర్‌ను సమర్థవంతంగా అమలు చేయడంతోపాటు డిజిటల్‌ మౌలిక సదుపాయాల్ని మెరుగుపర్చడం, ఫిజికల్, వర్చువల్‌ విద్యను ఏకీకృతం చేయడం ద్వారా మెరుగైన బోధన విధానాలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

ఇంటర్మీడియట్‌లో వృత్తి విద్య విద్యార్థులకు డ్యుయల్‌ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. జాతీయ నైపుణ్య విద్య అర్హత ప్రేమ్‌ వర్క్‌, జాతీయ వృత్తి విద్య, శిక్షణ మండలితో కలిసి వీటిని ఇవ్వనున్నారు. అకడమిక్‌ వివరాల సమాచారాన్ని అందించేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో వాట్సప్‌ గ్రూపులు ఏర్పాటు చేయనున్నారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించి 100% అపార్‌ నంబర్లు కేటాయించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది.

విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు పెంచేందుకు ఆటలకు సంబంధించిన సామగ్రి అందించనున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బడుల్లోనూ కంప్యూటర్స్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు 475 కళాశాలల్లో జనవరి ఒకటి నుంచి మధ్యాహ్న భోజనం అమలు చేయనున్నారు. ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రతి 10-15మంది విద్యార్థులను బోధన, బోధనేతర సిబ్బందికి అనుసంధానం చేస్తూ అన్ని కళాశాల్లోనూ మెంటర్‌షిప్‌ అమలు చేస్తున్నారు.

సంక్రాంతి కంటే ముందే పాఠశాలల్లో పండుగ వాతావరణం: లోకేశ్

ABOUT THE AUTHOR

...view details