ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ, విజయవాడలో మెట్రో ప్రాజెక్టులు -25 కి.మీ మేర డబుల్ డెక్కర్ విధానం - CM CHANDRABABU REVIEW ON METRO

విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష - 100 శాతం ఈక్విటీ కేంద్రమే చెల్లించేలా చర్చించాలని నిర్ణయం

CM_Chandrababu_review_on_metro
CM_Chandrababu_review_on_metro (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 2, 2025, 9:21 PM IST

Govt Ready to take up Metro Projects in AP: విశాఖ, విజయవాడలో మెట్రో ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. విజయవాడలో 66, విశాఖలో 76.90 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ప్రాజెక్టులు చేపట్టేందుకు ఇప్పటికే డీపీఆర్​లను ప్రభుత్వం ఆమోదించింది. ఈ ప్రాజెక్టులకు నిధుల అంశంపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 2 నగరాల్లోనూ మెట్రో రైలు ప్రాజెక్టు స్థితిగతులను ఆ సంస్థ ఎండి రామకృష్ణారెడ్డి ప్రజెంటేషన్ ద్వారా సీఎంకు వివరించారు. 2017లో వచ్చిన కొత్త మెట్రో పాలసీ ప్రకారం రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టులకు నిధుల సమీకరణ విధానాలపై సీఎం చంద్రబాబు చర్చించారు.

2017 మెట్రో రైల్ పాలసీ ప్రకారం 100 శాతం ఈక్విటీ కేంద్రమే చెల్లిస్తూ కోల్‌కతాలో 16 కిలోమీటర్ల మేర ప్రాజెక్టు చేపట్టారని అధికారులు వివరించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, రైల్వేశాఖలు ఆ ప్రాజెక్టుకు రూ.8,565 కోట్లతో మేర వ్యయం చేపట్టాయని తెలిపారు. ఇదే తరహాలో ఏపీలో కూడా మెట్రో పాజెక్టులు చేపట్టే అంశంపై కేంద్రంతో చర్చించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కూడా రాష్ట్రానికి మెట్రో ప్రాజెక్టు ఉందని 2017 మెట్రో పాలసీ ద్వారానైనా కేంద్రం ఈ ప్రాజెక్టు నిధుల భరించేలా సంప్రదింపులు జరుపుతామని సీఎం తెలిపారు.

అమరావతిలో రూ.2,733 కోట్ల పనులకు కేబినెట్​ ఆమోదం

విశాఖ, విజయవాడలలో చేపట్టే మెట్రో రైల్ ప్రాజెక్టుల్లో డబుల్ డెక్కర్ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. జాతీయ రహదారి చోట్ల డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో ప్రాజెక్టును నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ విధానంలో దిగువన సాధారణ రహదారి మొదటి డెక్​లో ఫ్లై ఓవర్, రెండో డెక్​లో మెట్రో రైల్ వచ్చేలా ప్రణాళిక చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. విశాఖలో మొదటి దశలో చేపట్టే మధురవాడ నుంచి తాడిచెట్లపాలెం వరకు 15 కిలోమీటర్ల మేర, గాజువాక నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు 4 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మోడల్​లో మెట్రో నిర్మించనున్నారు.

విజయవాడలో రామవరప్పాడు రింగ్ నుంచి నిడమానూరు వరకు 4.7 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే ఈ తరహా నిర్మాణాలను వివిధ నగరాల్లో వినియోగిస్తున్నారని రాష్ట్రంలో కూడా అదే తరహా నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. కేంద్రంతో త్వరతిగతిన సంప్రదింపులు పూర్తి చేసి మెట్రో పనులు ప్రారంభమయ్యేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. 4 ఏళ్లలో ఈ 2 నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చేలా లక్ష్యాన్ని నిర్ధేశించుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.

ఆలోగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి - అధికారులకు సీఎం చంద్రబాబు సూచన

అమరావతి అభివృద్ధి చెందే నగరం - ఇక సినిమాలన్నీ ఏపీలోనే: సీఎం చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details