Report on AP Floods Loss 2024: వరద విపత్తు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 6880.23 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. ఈ మేర కేంద్రానికి పంపేందుకు ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. రెవెన్యూ శాఖకు 750 కోట్ల నష్టం, పశు సంవర్ధక శాఖకు 11.58 కోట్ల నష్టం, మత్స్య శాఖకు 157.86 కోట్ల నష్టం, వ్యవసాయ శాఖకు 301.34 కోట్లు నష్టం, ఉద్యాన శాఖకు 39.95 కోట్ల నష్టం వాటిల్లినట్లు నివేదికలో పేర్కొంది. విద్యుత్ శాఖకు 481.28 కోట్లు, ఆర్ అండ్ బీ 2164.5 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా 75.59 కోట్లు, పంచాయతీ రోడ్లు 167.55 కోట్లు, నీటి వనరులు 1568.55 కోట్లు, పురపాలక, అర్బన్ 1160 కోట్లు, అగ్నిమాపక, ఎస్డీఆర్ఎఫ్కు 2 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం నివేదిక సిద్ధం చేసింది.
RP Sisodia on Flood Damage Enumeration: మరోవైపు సోమవారం నుంచి మూడ్రోజులపాటు వరద నష్టం అంచనా వేయనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నిర్వహణ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. వరద పీడిత ప్రాంతాల్లో సోమవారం నుంచి మూడు రోజులపాటు నష్టం గణన జరుగుతుందని, నివాసితులు ఇంటిలో అందుబాటులో ఉంటే పూర్తి స్ధాయి వివరాల నమోదుకు అవకాశం ఉంటుందని చెప్పారు. విజయవాడ నగరంలోని 32 డివిజన్లలో 149 సచివాలయాల పరిధిలో రెండు లక్షల నివాసాలలో నష్టం గణన చేపడతామని మీడియా సమావేశంలో వెల్లడించారు. నష్టం గణన బృందానికి విజయవాడలో ఒక రోజు శిక్షణ ఇస్తామన్నారు. వరద నష్టం అంచనాలో 149 మంది తహసీల్దారులతోపాటు ఇతరులు సేవలందిస్తారని చెప్పారు.