AP Government Plans to Expand Coffee Cultivation : ప్రస్తుతం పాడేరు ఐటీడీఏ పరిధిలో పాడేరు, అరకు వ్యాలీ, చింతపల్లి ప్రాంతాల్లో 2.58 లక్షల ఎకరాల్లో కాఫీ పంట సాగు చేస్తున్నారు. దీనికి అదనంగా గిరిజన రైతుల్ని ప్రోత్సహించి మరో 40 వేల ఎకరాల్లో పంటను విస్తరించేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఏడాదికి 8 వేల ఎకరాల చొప్పున విస్తరించేలా ప్రణాళిక రూపొందించింది. దీన్ని మూడు విధాలుగా అమలు చేయనుంది. సాధారణంగా కాఫీ పంట సాగుకు సూర్యరశ్మి నేరుగా తాకకుండా సరిపడా నీడ ఉండాలి. ఇలా ఇతర మొక్కలు పెంచుతూ ఇప్పటికే నీడ ఉన్న కర్షకుల పొలాల్లో నేరుగా కాఫీ మొక్కలు నాటే చర్యలు ప్రభుత్వ చేపట్టనుంది. నీడ లేని రైతుల పొలాల్లో సిల్వర్ ఓక్ మొక్కల పెంపకాన్ని చేపట్టి ఆ తర్వాత కాఫీ సాగు చేపడతారు. ఇప్పటికే కాఫీ సాగు చేస్తున్న పొలాల్లో పెరుగుదల లేని మొక్కలు తొలగించి వాటి స్థానంలో కొత్తవి నాటనున్నారు. మొత్తం దీనికి రూ.400 కోట్ల వ్యయం కానుంది.
‘ఉపాధిహామీ’ అనుసంధానంతో వరమే :గిరిజన రైతుల ఆదాయం పెంచేందుకు 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం కాఫీ సాగును విస్తృతంగా ప్రోత్సహించింది. లక్ష ఎకరాల్లో సాగు విస్తరించేలా చర్యలు తీసుకుంది. అప్పట్లో కర్షకులకు సాగు ఆర్థిక భారం కాకుండా ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానించి అమలు చేసింది. తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం దీన్ని పక్కన పెట్టింది. తాజాగా కూటమి ప్రభుత్వం రావడంతో కాఫీ సాగును ప్రోత్సహించేందుకు మళ్లీ ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానించాలని నిర్ణయించింది.
దీనికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అంగీకరించింది. దాంతో కాఫీ సాగుకు రైతులు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. మొక్కలను ఉచితంగా అందిస్తారు. నర్సరీ నుంచి రవాణా మొదలు, మొక్కలు నాటేందుకు లైన్ మార్కింగ్, గోతులు తవ్వడం, పాదులు తీయడం, కందకాలు ఏర్పాటు చేయడం, పొలం చుట్టూ ఫెన్సింగ్ ఇలా అన్నింటికీ ఉపాధి హామీ పథకంలో భాగంగా లేబర్ కాంపోనెంట్ కింద నిధులు మంజూరు చేస్తారు. దాంతో ఒక్కో రైతుపై రూ.40 వేల నుంచి రూ.70 వేలకు పెట్టుబడి వ్యయాన్ని ప్రభుత్వమే భరించనుంది.