ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"పెట్టుబడులు, ప్రోత్సాహకాలు" - రాష్ట్రం రూపురేఖలు మార్చనున్న "ఆరు పాలసీలు" - ANDHRA PRADESH INDUSTRIAL POLICY

ఏపీలో పరిశ్రమలు పెట్టేవారికి రాచబాట - దేశంలో ఎక్కడా లేని విధంగా వేల కోట్లతో రాయితీలు

government_has_given_various_incentives_for_industries
government_has_given_various_incentives_for_industries (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 28, 2024, 1:09 PM IST

Government Has Given Various Incentives For Industries : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాళ్లు పారిశ్రామికీకరణ, లక్షల సంఖ్యలో యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన. వీటిని అధిగమించాలంటే అంత ఆషామాషీ కాదు. అయినప్పటికీ రాష్ట్రప్రభుత్వం ఆ సవాళ్లను స్వీకరించింది. అధికారంలోకి వచ్చిన కేవలం 120 రోజుల్లోనే పక్కా రోడ్‌మ్యాప్‌తో ముందుకొచ్చింది. 2014-19 మధ్య అనేక విభజన సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల మధ్యే పారిశ్రామికరంగానికి పెద్దపీట వేసి కియా లాంటి పరిశ్రమల్ని చంద్రబాబు రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఇప్పుడు మలివిడతలో ఒకేరోజు ఆరు పాలసీలు ప్రకటించి దేశ, విదేశాల్లోని పెట్టుబడిదారుల దృష్టంతా రాష్ట్రంపై పడేలా చేసింది.

రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రకటించిన ఆరు పాలసీలతో పాటు, ఐటీ, టెక్స్‌టైల్, డ్రోన్‌ రంగాలకు సిద్ధం చేసిన ముసాయిదా పాలసీలూ ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉత్తమమన్న ప్రశంసలు అందుకుంటున్నాయి. అందులో పరిశ్రమలకు రాయితీల్ని ఎస్క్రో ఖాతాల్లో జమచేయడం, సాధారణ ప్రజల్ని, రైతుల్ని భాగస్వాముల్ని చేస్తూ ప్రైవేటు ఇండస్ట్రియల్‌ పార్కుల ఏర్పాటు చేయటం ఉన్నాయి. అలాగే ఇంటికో పారిశ్రామికవేత్త(Business man) తయారయ్యేలా సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సాహలు ఉంటాయి.

మొదట పరిశ్రమలు ఏర్పాటుచేసిన 200 మందికి పెద్ద ఎత్తున రాయితీలు, భారీసంఖ్యలో ఉద్యోగాలు, ఉపాధి కల్పించినవారికి 10% అదనపు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. రాష్ట్రాన్ని టెక్స్‌టైల్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రూ.500 కోట్లతో కార్పస్‌ఫండ్‌ ఏర్పాటు, మూలధన పెట్టుబడిలో గరిష్ఠంగా 75% రాయితీ వంటివి రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే దిశగా పెద్ద ముందడుగుగా పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.

పరిశ్రమలకు మెరుగైన ప్రోత్సాహకాలు

  • కొత్త విధానం ప్రకారం స్థిర మూలధన పెట్టుబడిలో (FCI) రాష్ట్రప్రభుత్వం సగటున 32%, గరిష్ఠంగా 72% వరకు ప్రోత్సాహకాలు ఇస్తుంది.
  • ఉత్తర్‌ప్రదేశ్‌ ఎఫ్‌సీఐలో గరిష్ఠంగా 100% ప్రోత్సాహకం ఇస్తున్నా, ఏపీలో ఉన్న పెట్టుబడుల అనుకూల వాతావరణం అక్కడ లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
  • ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు అత్యధికంగా నెట్‌ ప్రెజెంట్‌ వాల్యూ (NPV) నెంబర్స్‌ ప్రకారం సగటున 31% ప్రోత్సాహకాలు అందిస్తుంటే, ఇప్పుడు ఏపీ పాలసీలో 32% పెట్టారు.
  • తెలంగాణలో క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సబ్సిడీ లేదు. అక్కడితో పోలిస్తే ఎన్‌పీవీ నెంబర్స్‌ ప్రకారం సుమారు 20% ఎక్కువగా ఏపీ ప్రోత్సాహకాలు ఇవ్వనుంది.
  • కర్ణాటకలో ఎన్‌పీవీ నెంబర్స్‌ ప్రకారం 38% వరకు ప్రోత్సాహకాలు ఇస్తున్నా అక్కడ వార్షిక టర్నోవర్‌ లక్ష్యాలను చేరుకుంటేనే వర్తింపజేస్తున్నారు. దీంతో ఆచరణలో పరిశ్రమలకు అంత ప్రోత్సాహకం రాదు.
  • రాష్ట్రంలో పెట్టుబడి పెట్టినవారికి ఎఫ్‌సీఐలో ప్రోత్సాహకాల కింద ఏటా రూ.4,873 కోట్ల చొప్పున 12 ఏళ్లలో రూ.58,478 కోట్లు చెల్లించాలని అంచనా.
  • ఉపాధి కల్పన ఆధారంగా ఏటా రూ.1,101 కోట్ల చొప్పున 11 ఏళ్లలో రూ.12,111 కోట్ల రాయితీ ఇస్తుంది.
  • ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం’ కింద ఏటా సగటున రూ.28 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.140 కోట్లు ఇస్తుంది.

ఎస్క్రో ఖాతా ద్వారా రాయితీలు గేమ్‌ ఛేంజర్‌

ప్రభుత్వాలు పరిశ్రమలకు రాయితీలు ప్రకటిస్తాయే గానీ ఇస్తాయన్న గ్యారంటీ ఉండదు. ఇది పారిశ్రామికవేత్తలకు ఉండే అనుభవం. అలాంటి అపనమ్మకాలకు తావులేకుండా కొత్త పారిశ్రామిక విధానంలో ప్రభుత్వం ఎస్క్రో ఖాతా నిబంధన తెచ్చింది. రాయితీ మొత్తం ఎస్క్రో ఖాతాలో ఉంటుంది. ప్రభుత్వ షరతుల్ని పరిశ్రమలు నెరవేర్చగానే రాయితీ మొత్తం ఆటోమేటిక్‌గా వారికి వెళ్లిపోతుంది. దీన్ని రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చే గేమ్‌ఛేంజర్‌గా పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.

ఐదేళ్లలో తయారీరంగంలో రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు, 5లక్షల మందికి ఉపాధి, రూ.83వేల కోట్ల ఎఫ్‌డీఐల వంటి లక్ష్యాలతో దక్షిణాదిలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పరిశ్రమల యాజమాన్యాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయగానే షెడ్యూల్‌ ప్రకారం ప్రోత్సాహకాలు విడుదలవుతాయి. పరిశ్రమలు ప్రభుత్వానికి పన్నుల రూపేణా చెల్లించే ఆదాయం నుంచే ప్రోత్సాహకాలు చెల్లించేలా ఎస్క్రో ఖాతాకు నిధులు సమకూర్చుతుంది. అధికారుల అంచనా ప్రకారం ఒక పరిశ్రమ రూ.100 పన్నుల రూపేణా ప్రభుత్వానికి చెల్లిస్తే దానిలో రూ.75 ప్రోత్సాహకాల కింద తిరిగి వారికే వెళుతుంది. ఇలా గరిష్ఠంగా పదేళ్లు ప్రోత్సాహకాలు చెల్లించాక ఆ పరిశ్రమ పన్నుల రూపంలో చెల్లించే మొత్తం ప్రభుత్వానికి వస్తుంది.

పారిశ్రామిక పురోగతికి ఇది 4.0 వెర్షన్‌

విభజన తర్వాత వ్యవసాయాధారిత రాష్ట్రంగా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు 2014-19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచ ఆర్థికవేదిక (WEF) సదస్సులకు హాజరవుతూ, విదేశాల్లో పర్యటిస్తూ, రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలతో భాగస్వామ్య సదస్సులు నిర్వహిస్తూ పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు చేయని ప్రయత్నం లేదు. ఆ క్రమంలోనే కియా, అపోలో టైర్స్, ఏషియన్‌ పెయింట్స్, మెడ్‌టెక్‌ పార్క్, తిరుపతిలోని ఎలక్ట్రానిక్‌ క్లస్టర్‌లో సెల్‌ఫోన్‌ తయారీ యూనిట్లు వచ్చాయి. రిలయన్స్‌ లాంటి పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధమవుతుండగా 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్ని బెంబేలెత్తించింది.

రాష్ట్రాన్ని తిరోగమనంలోకి నెట్టేసింది. దీంతో కొత్త పరిశ్రమలు రావడం మాట అటుంచి, ఉన్న పరిశ్రమలే రాష్ట్రం విడిచి పారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు పారిశ్రామిక పురోగతిలో 4.0 వెర్షన్‌కు శ్రీకారం చుట్టారు. మొదటిరోజు నుంచీ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కలిగించి, రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంపై ప్రభుత్వం ప్రత్యేకదృష్టి పెట్టింది. విశాఖలో 10వేల మందికి ఉపాధి కల్పించే టీసీఎస్‌ సెంటర్‌ ఏర్పాటుకు టాటా గ్రూప్‌ను ఒప్పించింది.

  • ‘ఎర్లీ బర్డ్‌ ఆఫర్‌’ కింద మొదట వచ్చిన పరిశ్రమలకు ఎఫ్‌సీఐలో 60% వరకు ప్రోత్సాహకం ప్రకటించడం పెట్టుబడిదారులకు ప్రేరణగా నిలవనుంది.
  • ఉపాధి కల్పన ఆధారంగా 10% అదనపు ప్రోత్సాహకాలు ఇస్తామనడం పెట్టుబడుల ఆకర్షణలో కీలకంగా మారనుంది.

రెండేళ్లలో రూ.50 కోట్ల నుంచి రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టే పరిశ్రమల్ని ‘సబ్‌లార్జ్‌’, మూడేళ్లలో రూ.501 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్లు పెట్టేవాటిని ‘లార్జ్‌’, మూడేళ్లలో రూ.1,001 కోట్ల నుంచి రూ.5వేల కోట్ల వరకు పెట్టేవాటిని ‘మెగా’, నాలుగేళ్లలో రూ.5,001 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేవాటిని ‘అల్ట్రా మెగా’ పరిశ్రమలుగా వర్గీకరించారు.

ఆహారశుద్ధి పరిశ్రమలకు ఊతం

రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో రూ.30వేల కోట్ల పెట్టుబడులు సాధించడం, 3లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఆహారశుద్ధి పరిశ్రమల విధానాన్ని ప్రకటించింది. రైతులే సొంత భూముల్లో ఆహారశుద్ధి పార్కులు ఏర్పాటుచేస్తే ఎకరాకు రూ.5 లక్షల చొప్పున ప్రోత్సాహకం ఇస్తుంది.

ఏపీ పారిశ్రామికాభివృద్ధి పాలసీ 4.0 - క్యాబినెట్​ ఆమోదముద్ర - 20 లక్షల ఉద్యోగాలు లక్ష్యం

స్వర్ణాంధ్రప్రదేశ్‌-2047 కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌- కో ఛైర్మన్​గా చంద్రశేఖరన్: చంద్రబాబు - Tata Group Chairman Met CM Cbn

ABOUT THE AUTHOR

...view details